అరెస్టులు – బైండోవర్లు

May 24,2024 00:21

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారనే సమాచారంతో నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో పోలీసుల బందోబస్తు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున, అనంతరం కొనసాగిన అల్లర్లపై నిందితులుగా ఉన్న వారిని పోలీసులు క్రమంగా అరెస్టు చేస్తున్నారు. పలువురిని బైండోవర్‌ చేస్తున్నారు. నిందితుల గుర్తింపునకు విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి 41ఎ నోటీసులిచ్చి లిఖితపూర్వకంగా సమాధానం తీసుకుంటున్నారు. మొత్తంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లు పోలీసు శాఖకు శిరోభారంగా మారాయి. కొత్త ఎస్‌పి మల్లికా గర్గ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మొత్తం జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. 581 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. గుర్తించిన నిందితుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. 274 మందిని ఇప్పటి వరకు గుర్తించగా గురువారం మొత్తం 54 మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌పి మలికా గర్గ్‌ తెలిపారు. దాచేపల్లి మండలం తంగెడలో జరిగిన ఘర్షణల కేసుల్లో వైసిపికి చెందిన 22 మందిని, టిడిపికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు. నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి సబ్‌ డివిజన్ల పరిధిలో 9 మందికి 41ఎ నోటీసులిచ్చినట్లు పల్నాడు ఎస్పీ తెలిపారు. మొత్తం 74 మందిని బైండోవర్‌ చేశామని, వీరిలో నరసరావుపేట సబ్‌ డివిజన్లో ఒకరు, సత్తెనపల్లి సబ్‌ డివిజన్లో 46 మంది, గురజాల సబ్‌ డివిజన్లో 27 మంది ఉన్నారని, నరసరావుపేట సబ్‌ డివిజన్‌లో మరో ఐదుగురిపై రౌడీషీట్లు తెరిచామని వివరించారు. అల్లర్లలో పాల్గొన్న వారిలో ఐదుగురిని బైండోవర్‌ చేయగా వారు మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు న్యాయస్థానంలో హాజరుపర్చి నోటీసులు జారీ చేశామని, కారును సీజ్‌ చేశామని చెప్పారు. సిట్‌ దర్యాప్తు చేసిన కేసులకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశామన్నారు. మొత్తంగా గురువారం పల్నాడు జిల్లాలో 54 మందిని అరెస్టు చేశామన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ముందుస్తు బెయిల్‌రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వివిప్యాట్‌ మిషన్ల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు అనుమతించింది. విచారణ అనంతరం జూన్‌ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసు అధికారులను, ఈసీని కోర్టు ఆదేశించింది. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రామకృష్ణారెడ్డి అరెస్టుపై రెండ్రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. గురువారం నరసరావుపేట కోర్టులో రామకృష్ణారెడ్డి లొంగిపోతున్నారని ప్రచారం జరగ్గా అక్కడ పోలీసులు భారీగా మొహరించారు. ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయి పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుల ద్వారా బెయిల్‌ కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. నర్సరావుపేటలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి కూడా హైకోర్టు ఉత్తర్వులతో ఊరట లభించినట్లయింది. పోలింగ్‌ అధికారుల సస్పెన్షన్‌ మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సత్తెనపల్లి జిజెసి జూనియర్‌ కళాశాల జూనియర్‌ లెక్చరర్‌ ఆఫీసర్‌ పివి సుబ్బారావు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటాపురం జెడ్‌పి హైస్కూల్లో టీచర్‌ షేక్‌ షహనాజ్‌ బేగంను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈపోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినా సకాలంలో కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు చేయకపోవడం, ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రంలోకి రాగానే లేచి నిలబడి నమస్కారం చేయడం కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదులపై వీరిని సస్పెండ్‌ చేయాలని ఈసి ఆదేశించింది.రాంబాబు రీపోలింగ్‌ పిటీషన్‌ డిస్మిస్‌సత్తెనపల్లి నియోజకవర్గంలో అల్లర్లు జరిగిన నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని వైసిపి అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

➡️