మిమ్స్‌ ఉద్యోగుల అరెస్టులు అన్యాయం

Apr 3,2024 21:44

ప్రజాశక్తి- బొబ్బిలి : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల అక్రమ అరెస్టులకు నిరసనగా పట్టణంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని 62 రోజులుగా ఆందోళన చేస్తే యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మిమ్స్‌ యాజమాన్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు ఆరేళ్ల నుంచి వేతన ఒప్పందం చేయకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు కలుగజేసుకుని వేతన ఒప్పందం చేయాల్సి ఉన్నప్పటికీ చేయడం లేదన్నారు. వైద్య రంగంలో కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యం కార్మికులు, ఉద్యోగులకు ఎందుకు వేతనాలు పెంచడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.రామభద్రపురం: అర్ధాకలితో అలమటిస్తున్న మిమ్స్‌ కార్మికుల అక్రమ అరెస్టులు అన్యాయమని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్షణమే కార్మికులకు వేతన ఒప్పందం చేసి జీతాలు పెంచాలని, వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. 2011 నుండి 2020 ఏప్రిల్‌ వరకు ప్రభుత్వం ప్రకటించిన డిఎను ఉద్యోగులందరికీ చట్టప్రకారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ 2020 అక్టోబర్‌ నుండి నేటి వరకు డిఎలను ఏ ఒక్కరికీ చెల్లించలేదని, వీటిని ఎరియర్స్‌తో పాటు చెల్లించి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని సస్పెన్షన్ల, బదిలీలు నిలిపివేసి యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, జనార్ధన, నాగరాజు పాల్గొన్నారు.తెర్లాం: నెల్లిమర్ల మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల అక్రమ అరెస్టుపై మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి గోపాలం మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 62 రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. వైద్యరంగంలో కోట్లాది రూపాయలు లాభాలు అర్జిస్తున్న కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి గోపాల్‌రావు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

➡️