ఎన్నికల నియమావళి అతిక్రమణ

Mar 19,2024 15:28 #chittore
  •  ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ఎన్నికల కోడ్‌ ఉల్లఘించిన చిత్తూరు జిల్లా గుడిపల్లి ఉపాధి హామీ చట్టం ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కుప్పం టెక్నికల్‌ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుడిపల్లి మండలం చీకటిపల్లి గ్రామం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎం.వెంకటేష్‌.. వైసిపి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. రామకుప్పం మండలానికి చెందిన మురుగేశ్‌…కుప్పం మండలం టెక్నికల్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వైసిపి ఎమ్మెల్సీ భరత్‌ పిఎగా ఉన్నారు. కుప్పం రెవెన్యూ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో ఆర్‌ఒ, ఆర్‌డిఒ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి, కాంగ్రెస్‌, జనసేన తరుపున నాయకులు పాల్గొనగా.. వైసిపి తరుపున ఎమ్మెల్సీ పిఎ మురుగేశ్‌ పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆర్‌ఒకు ఫిర్యాదు చేశారు. దీంతో విధుల నుంచి మురుగేశ్‌ను తొలగించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

➡️