బాబు మేనిఫెస్టోను అమలు చేయరు

May 11,2024 23:54

సభకు హాజరైనవారితో సెల్ఫీ దిగుతున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
టిడిపి అధినేతచంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఏ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కళామందిర్‌ సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై కానీ నియోజకవర్గం భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి పనులపై హామీలేమీ లేకుండానే ఆయన ప్రసంగాన్ని ముగించారు. చంద్రబాబుపై విమర్శలు, తాను గత ఐదేళ్లులో చేపట్టిన పథకాలను మాత్రమే ప్రస్తావించారు. తాను 132 సార్లు బటన్‌ నొక్కటం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముల ఖాతాలకు చెల్లింపులు జరిగాయన్నారు. ఈ విషయాన్ని నేను ఇక్కడే ఉన్నా వేలమంది నా అక్కచెల్లెల్లు, అన్న దమ్ములను అడుగుతున్నా.. ఈ 59 నెలల్లో చెప్పిన మాటను చెప్పినట్లే మేనిఫెస్టోలోని అంశాలను 99 శాతం అమలు చేశాం అని అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన విధంగా గతంలో ఏ ప్రభుత్వమైనా చేయగలిగిందా అని అడిగారు. విశ్వసనీయతకు అర్థం తెలిపిన నాయకుడు మీ జగనన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. 2014లో చంద్రబాబు అమలు చేస్తానన్న మేనిఫెస్టో చెత్తబుట్టలో వేశారన్నారు. రైతులకు రుణమాఫీ రూ.87,612 కోట్లు ఎందుకు చేయలేదన్నారు. పొదుపు సంఘాలకు రూ.14,205 కోట్లు రద్దు చేస్తామని చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.25 వేలు బ్యాంకులో వేస్తామని ఇప్పటి వరకు వేయలేదన్నారు. అర్హులైన పేదలకు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఒక్కసెంటు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రతి ఇంటికీ బెంజ్‌ కార్‌ ఇస్తామని, బంగారం ఇస్తామని వస్తున్నారని, వారు మాయమాటలు విని మోసపోవద్దని కోరారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కావటి శివనాగ మనోహర్‌ నాయుడును, నరసరావుపేట ఎంపీగా పి.అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. సభలో ఎమ్మెల్సీలు మర్రిరాజశేఖర్‌, చంద్ర గిరి ఏసురత్నం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️