అరటి సాగు.. బాగు బాగు!

May 21,2024 23:11 #అరటి సాగు
అరటి సాగు

లాభదాయకంగా తోటల పెంపకం

స్వయంఉపాధిగా గిరి యువత ఆసక్తి

ఎకరానికి రూ.లక్ష వార్షికాదాయం గ్యారెంటీ అంటున్న యువరైతు నీలకంఠం

ఐటిడిఎ ఉద్యానవనశాఖ తోడ్పాటుకు అభ్యర్థన

ప్రజాశక్తి-పాడేరు: డిగ్రీలు చదివి ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్న మన్యంలోని గిరిజన యువత ప్రస్తుతం స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరి చాలీచాలని జీతాలతో బతకడం కంటే, తమ మన్యంలోనే తోటల పెంపకం, నూతన వంగడాలు, పంటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. మన్యానికి అనుకూలమైన తోటల పెంపకంపై దృష్టి పెడితే స్వయం ఉపాధితో పాటు మంచి లాభార్జన, వనాల పెంపకం వంటి ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని గిరిజన యువత భావిస్తున్నారు. పాడేరు మండలం లంపెల్లి గ్రామానికి చెందిన గిరిజన యువరైతు తరడా నీలకంఠంనాయుడు అరటి సాగు చేపట్టి ఆశాజనకంగా దిగుబడి సాధించి గిరిజన యువతకు ఆదర్శంగా, ఒక ప్రోత్సాహకుడిగా మార్గనిర్ధేశం చేస్తున్నాడు. బిఎస్‌సి పట్టభద్రుడై తర్వాత బిఇడి, పిజి కోర్సు కూడా పూర్తి చేసుకున్న నీలకంఠం కొన్నాళ్లు ఉద్యోగం కోసం నిరీక్షించి చివరికి ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల వివాహం చేసుకొని ఉపాధి కోసం ఆదాయ మార్గాలను వెతుకుతూ తనకు ఉన్న ఒక ఎకరా విస్తీర్ణం గరువులో దుక్కి దున్ని అరటి సాగును ప్రారంభించాడు. ఏడాది కాలంలోనే అరటి సాగు వల్ల వచ్చిన లాభాలను, తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా ఇతర గిరిజన యువ రైతులకు వివరిస్తూ, అరటి మొక్కలను తక్కువ ధరకే సరఫరా చేసి తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చాడు. నిరుద్యోగ గిరిజన యువత తమ గ్రామాల్లో అరటి సాగు చేపడితే స్వయం ఉపాధి లభిస్తుందని అందరికీ అవగాహన కల్పిస్తుండడంపై పలువురు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా నీల కంఠం నాయుడు ప్రజాశక్తితో అరటి సాగుపై తన అనుభవాలను తోటల పెంపకం పై ఆసక్తి వ్యక్తం చేశారు.ఎకరా విస్తీర్ణంలో అరటి సాగుకు రూ. 8 వేల వ్యయంఒక ఎకరా విస్తీర్ణంలో అరటి సాగుకు రూ.8 వేల అవుతుందని, దీని ద్వారా వార్షికాదాయం ఏడాదికి మినిమం లక్ష రూపాయలు వస్తుందని నీలకంఠం నాయుడు తెలిపారు. పరిస్థితులు, ధర కాస్తా అనుకూలిస్తే ఇంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని వివరిస్తున్నాడు. తాను మైదాన ప్రాంతంలోని వడ్డాది పరిసరాల్లో అరటి సాగు పద్ధతులను పరిశీలించి, వాటిపై అవగాహన పొంది, అక్కడ రైతుల నుంచే మొక్క రూ.15 చొప్పున కొనుగోలు చేసి తెచ్చి సాగుచేసానని అంటున్నాడు. ె. గత ఏడాది తన ఒక ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది వందల అరటి మొక్కలు నాటానని తెలిపారు. ఈ హైబ్రిడ్‌ అరటి దిగుబడి బాగుందని, అరటి గెలలు ఏపుగా వచ్చాయని అంటున్నారు. పొలం ఉండి సాగునీటి వసతి ఉంటే అరటి సాగు చేపడితే చాలా లాభదాయకమని, నిరుద్యోగ యువత ఉపాధి కోసం అరటి సాగు చేపట్టాలని సూచిస్తున్నాడు. గిరిజన నిరుద్యోగ యువరైతుల్ని ప్రోత్సహించడం కోసం తాను అరటి మొక్కల్ని రూ.పదికే ఒక్కొక్కటీ అందజేస్తానంటున్నాడు. తక్కువ ఖర్చు, శ్రమతో అరటి సాగు యువ రైతులకు సౌలభ్యంగా ఉంటుందన్నాడు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఈ అరటి మొక్కల్ని నాటితే, పంట దిగుబడి బాగుండి, మంచి లాభాలు వస్తాయంటున్నాడు. అరటిసాగు వల్ల నష్టం వచ్చే పరిస్థితి ఉండదన్నాడు. కాఫీ మాదిరిగానే అరటి సాగుకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగానే పనులు చేసుకునే అవకాశం ఉందని, ఇంటి ఆవరణలోని దొడ్లు గరువుల్లో దుక్కు దున్ని ఒక ఎకరావిస్తీర్ణం వరకు అరటి మొక్కలు పెంచితే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఐటిడిఎ హార్టీకల్చర్‌ విభాగం తోడ్పాటునివ్వాలి.పండ్ల తోటల పెంపకానికి ముందుకు వచ్చే నిరుద్యోగ గిరిజన యువతకు ఐటిడిఎ, హార్టీకల్చర్‌ విభాగం తోడ్పాటు అందించాలని నీలకంఠం నాయుడు కోరుతున్నాడు. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారిలో చాలామంది రైతు పని తెలిసిన వారేనని, అరటి ఇతర పండ్ల తోటల పెంపకానికి తోడ్పాటు ఇస్తే ఏజెన్సీలో నిరుద్యోగ సమస్య పరిష్కారమౌతుందన్నాడు ఉద్యాన శాఖ ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చి పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందించాలని నీలకంఠం నాయుడు కోరారు.

➡️