అంగన్‌వాడీల అభినంద సభ

Jan 29,2024 00:46

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్రంలో 42రోజులు సమ్మె నిర్వహించి పోరాడి సాధించిన అంగన్‌వాడీల అభినందన సభ ఆదివారం నిర్వహించారు. అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో స్థానిక మైనేని సీతారామయ్య కళ్యాణ మండపంలో జరిగిన అభినందసభకు సీనియర్ నాయకులు కె రత్నకుమారి అధ్యక్షత వహించారు. సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలపై ఎస్మాను ప్రయోగించినప్పటికీ ప్రభుత్వం మెడలు వంచి కొన్ని విజయాలు సాధించుకోవడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సిఎం కార్మికవర్గాన్ని అణిచి పెట్టడం కోసం నాలుగున్నర సంవత్సరాలు ప్రయత్నించడంతో చివరలో తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి అంగన్‌వాడీలను తొలగిస్తామంటూ కేంద్రాలు తాళాలు పగలగొట్టారని అన్నారు. అయినప్పటికీ ధైర్యంతో పోరాడిన మహిళలందరికీ అభినందనలు తెలిపారు. మహిళల శక్తి ముందు చాలా ప్రభుత్వాలు దిగివచ్చిన చరిత్ర ఉందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుటి అమలుచేస్తున్నారని, మన ప్రభుత్వం అమలు చేయటం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాస్తామనటం సమస్య నుండి తప్పుకోవటమేననీ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఒలను అమలు చేయాలని అన్నారు. అధికార పార్టీ నేతలు అంగన్‌వాడిలను అణచి పెట్టాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. అన్నిటినీ ఎదిరించి విజయం సాధించిన అంగన్వాడీల స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికవర్గం నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని అన్నారు. సభలో యుటిఎఫ్ రేపల్లె మండల అధ్యక్షులు కె రాజభూషణం, రవీంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎన్ శివశంకర్, డివైఎఫ్ఐ నాయకులు కెవి లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె ధర్మరాజు, ప్రజా సంఘాల నాయకులు వై కిషోర్, కె రమేష్, వై నవీన్, అంగన్‌వాడి యూనియన్ నాయకులు వై మేరీమణీ, కె రత్నకుమారి, ఉషారాణి, సోంతషకుమారి, ఎన్ కృష్ణాకుమారి, నిర్మల జ్యోతి, జోతీ, రజని పాల్గొన్నారు.

➡️