కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

Jun 27,2024 23:16 ##canel #Kommamuru #Karamchedu

ప్రజాశక్తి – కారంచేడు
మండలంలోని కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎఒ సుధీర్ బాబు కోరారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద రెవిన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్త సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఒ మాట్లాడుతూ కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, పాస్ ఫోటో నకలు కాఫీలను విఆర్‌ఒలకు అందచేస్తే గుర్తింపు కార్డులు జారిచేస్తారని తెలిపారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కౌలు రైతులును గుర్తించి సిసిఆర్సి కార్డ్స్ జారి చేసి రైతులకు అందచేయాలని డిప్యూటీ తహశీల్దారు సుశీల రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన విఆర్‌ఒలు, వ్యవసాయ శాఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భట్టిప్రోలు : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు గాను కౌలు రైతులు గుర్తింపు కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని తహశీల్దారు ఐ ముని లక్ష్మి సూచించారు. మండలానికి 5,430 కార్డులు అందించాలనే లక్ష్యాన్ని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల వీఆర్వోలకు టార్గెట్లు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు లభించే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈపాటికే ఆ గ్రామాల వీఆర్వోలు కౌలు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తింపు కార్డు పొందటం ద్వారా పంట నష్టపరిహారాలు ఎరువులు, పురుగు మందులు రాయితీపై పొందటానికి, ఆయా బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందటానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని కోరారు.
సంతమాగులూరు : మండలంలో రైతుల వద్ద పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతులు గ్రామాల్లోని ఆర్‌బికె వద్ద, వీఆర్వోల వద్ద కౌలు రైతు కార్డులు నమోదు చేసుకోవాల్సిందిగా తహశీల్దారు టీ ప్రశాంతి తెలిపారు. మండల పరిషత్ సమావేశం హాల్ నందు ఆర్‌బికె సిబ్బంది, వీఆర్వోలకు కౌలు రైతు కార్డులు మంజూరు విషయంపై గురువారం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు ఎవరెన్ని కౌలు రైతుల కార్డులు నమోదు చేయాలో టార్గెట్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మండలంలో 3500 కౌలు రైతుల కార్డులు టార్గెట్ ఉండగా ఈపాటికే 382కౌలు రైతు కార్డులు పూర్తి చేసినట్లు ఎఒ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️