రైల్వేస్టేషన్లో సమస్యల తిష్ట : శిథిలావస్థకు చేరిన భవనం

Jun 27,2024 23:18 ##APCPM #Battiprolu #NDA #BJP

ప్రజాశక్తి – భట్టిప్రోలు
తెనాలి నుండి రేపల్లెకి వెళ్లే రైలు మార్గంలో అత్యంత ప్రధానమైన బట్టిప్రోలు రైల్వే స్టేషన్ భవనం శిధిలావస్థకు చేరింది. స్టేషన్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు స్టేషన్ నుండి ప్రయాణిస్తూ ఉంటారు. స్టేషన్ నుండి నిత్యం 2వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రేపల్లె నుండి తెనాలి, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వ్యాపారులు, ఉద్యోగస్తులతో పాటు నిత్యం భవనిర్మాణ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసే కూలీలు రైలు మార్గం ద్వారా వెళ్లి పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటారు. రేపల్లె, తెనాలి మార్గంలో భట్టిప్రోలు స్టేషన్ నుండే రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం లభస్తుంది. భట్టిప్రోలు నుండి తెనాలి వెళ్లడానికి బస్సు మార్గం ద్వారా దాదాపు గంట సమయం పడుతుంది. కానీ రైలు ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే తెనాలి చేరుతుంది. పైగా ఇటీవల రైల్వే చార్జీలు కూడా తగ్గించి భట్టిప్రోలు నుండి తెనాలికి రూ.10 మాత్రమే ఉండటంతో ఎక్కువ మంది రైలు మార్గం ద్వారానే ప్రయాణిస్తుంటారు. అలాంటి ఆదాయం కలిగిన ఈ రైల్వేస్టేషన్‌ను రైల్వే శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలు తిష్ట వేశాయి. రైల్వే ప్లాట్ ఫామ్‌పై మరుగుదొడ్ల సౌకర్యం కరువైంది. మహిళలు, విద్యార్థులు సమయానికి ముందుగా వచ్చి ఉంటే మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మహిళలు, షుగరు వ్యాధి గ్రస్థుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. త్రాగునీటి ఏర్పాట్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్‌ స్టాండు లేక గల్లంతవుతున్న వాహనాలు
గతంలో భటప్రోలు రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కళకళలాడుతూ ఉండేది. స్టేషన్ బయట హోటళ్లు, టీ స్టాల్స్‌ ఉండటమే కాక ద్విచక్ర వాహనాలు నిలుపుకోవటానికి స్టాండ్ కూడా ఉండేది. రైల్వే శాఖ నిబంధనలు మార్పు చేయటంతో స్టేషన్ సమీపంలో ఎలాంటి హోటల్లు, టీ స్టాల్స్‌ లేకపోవడమే కాక ఉన్న వాహన స్టాండ్ కూడా ఎత్తివేశారు. దీంతో స్టేషన్‌కు ముందుగా వచ్చేవారు బిక్కు బిక్కు బంటు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాల స్టాండు లేకపోవడంతో దూర ప్రాంతాల నుండి రైలు మార్గం ద్వారా ప్రయాణించేవారు ద్విచక్ర వాహనాలు ఎక్కడ నిలుపుకోవాలో అర్థం కాక ఏదో ఒక ప్రాంతంలో నిలుపుకొని రైలుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి దుండగులు వాహనాలను అపహరిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
శిథిలావస్థలో స్టేషన్ భవనం
అత్యంత ప్రాధాన్యత కలిగిన భట్టిప్రోలు రైల్వే స్టేషన్ భవనం ప్రస్తుతం పగుళ్లుతో గోడలపై చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరింది. 50ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలవస్థకు చేరటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైల్వే శాఖ ఆధునీకరణ పేరుతో నిత్యం టెండర్లు కేటాయిస్తూ కాంట్రాక్టర్లకు ఏదో రూపంలో ఆదాయాన్ని సమకూరుస్తుందని, శిధిలావస్థకు చేరుతున్న భవనాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వంలో రైల్వే అధికారులు స్పందించి ప్రాధాన్యత కలిగిన భట్టిప్రోలు రైల్వే స్టేషన్‌లో త్రాగునీరు కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం, సైకిల్ స్టాండ్, నూతన భవన నిర్మాణం వంటి సమస్యలపై దృష్టి సారించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

➡️