అంబేద్కర్ అలోచనలు మార్గదర్శకం

Feb 13,2024 00:54

– అంబేద్కర్‌ కాంస్యవిగ్రహ ఆవిష్కరణ
– సభలో మంత్రి మేరుగ నాగార్జన, ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి
– పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలు
ప్రజాశక్తి – చీరాల
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు దేశానికి, పేదల సంక్షేమానికి దిశా, నిర్ధేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జన, ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. స్థానిక ముక్కోణం పార్కు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. రూ.30లక్షల పురపాలక నిధులతో పన్నెండున్నర అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ అందరివాడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను చట్టాలుగా మార్చుకొని పరిపాలించారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసిన దాఖలాలే లేవని అన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ ఆలోచన విధానాలతో పరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అందరూ గర్వపడేలా విజయవాడ పట్టణ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చీరాల ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నూతన విగ్రహాన్ని ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఇన్చార్జి వెంకటేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభకు వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు అధ్యక్షత వహించారు. సభలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️