బాచిన టిడిపిలోకెళ్లటం వైసీపీకే మేలు

Feb 17,2024 23:57

ప్రజాశక్తి – పంగులూరు
మాజీ ఎంఎల్‌ఎ బాచిన చెంచు గరటయ్య, ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య టిడిపిలోకి వెళ్ళటంతో వైసిపికి మేలు జరిగినట్లైందని, పార్టీకి పట్టిన దరిద్రం వదిలినట్లైందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వీరిద్దురు వైసిపిని వీడి టిడిపిలోకి వెళ్లిన నేపథ్యంలో స్థానిక వైసిపి కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు. మొదటి నుండి గరటయ్య నాయకత్వాన్ని వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారని అన్నారు. గంటయ్య కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పనిచేశారని మాజీ ఏఎంసీ చైర్మన్, వైసిపి సేవాదల్ జిల్లా అధ్యక్షులు పులికం కోటిరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ స్వయంపు హనుమంతరావు అన్నారు. 2019ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా బాచిన చెంచు గరటయ్య 13వేల ఓట్లు తేడాతో ఓడిపోయారని అన్నారు. ఆయనకు ప్రజల్లో ఏమాత్రం అభిమానం ఉందో ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. వైసిపి ఇన్చార్జి బాధ్యతలు గరటయ్యకు ఇచ్చిన తర్వాత, నిజమైన వైసిపి కార్యకర్తలంతా వైసిపికి దూరమయ్యారని అన్నారు. టిడిపికి చెందిన వారికే పదవులు కట్టబెట్టాడని అన్నారు. టిడిపి కార్యకర్తలను పెంచి పోషించాడని స్వయంపు హనుమంతరావు ఆరోపించారు. తండ్రి, కొడుకులు పార్టీ మారడంతో పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయిందని అన్నారు. ఎస్సీ సెల్ కన్వీనర్ సందిపోగు రవీంద్ర (బుజ్జి) మాట్లాడుతూ తండ్రి, కొడుకులు పార్టీ మారినంత మాత్రాన వైసిపికి ఎలాంటి నష్టం లేదని అన్నారు. బీసీ సెల్ కన్వీనర్ చక్రవరం భాస్కర్ రాజు మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలంతా ఐక్యంగా నిలబడి హనీమిరెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. వైసిపి జెండా ఎగురువేయాలని కోరారు. కార్యక్రమంలో వడియరాజుల కార్పొరేషన్ డైరెక్టర్ పల్లపు రాము, ఎంపీపీ తేళ్ల నాగమ్మ, వైసిపి మండల ఇన్చార్జి బెజ్జం శ్రీనివాసరెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షులు లోకిరెడ్డి కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షులు ఆంజనేయులు, గాదె బ్రహ్మారెడ్డి, హరి ప్రసాదరెడ్డి, ఎర్రం గోపాలరెడ్డి పాల్గొన్నారు.

➡️