కులవివక్షతో చేసిన బదిలీలు ఆపాలి

May 23,2024 00:02 ##Addanki #Library

ప్రజాశక్తి – అద్దంకి
ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులపై వివక్షా పూరితంగా వ్యవహరిస్తూ, వారిని మాత్రమే సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓసీ అధికారులను సమర్ధిస్తున్నట్లుగా వారిని వెనకేసుకొస్తున్న సీఎస్ జవహర్‌రెడ్డి నివేదికలు పంపడం, సీఈసి దాన్ని అమలు చేస్తూ విధుల నుండి తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. పేదల కలెక్టర్‌గా, ప్రజా సమస్యలను తీరుస్తున్న కలెక్టర్‌గా పేరు పొందిన పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ ఏ తప్పూ చేయకపోయినా కేవలం ఎస్సీ అనే భావనతో విధులకు దూరం చేయడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. దీనిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిచో ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, తెలగతోటి రాధాకృష్ణమూర్తి, కొమ్మాలపాటి బుజ్జిబాబు, మంచు హనుమంతరావు, కొప్పోలు విశ్వతేజ పాల్గొన్నారు.

➡️