తెలుగు ప్రజల భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యం

Mar 11,2024 00:13

బెంగళూరులో పర్చూరు వాసుల ఆత్మీయ సమావేశం
ఎమ్మెల్యే ఏలూరికి ఘన స్వాగతం
ప్రజాశక్తి – పర్చూరు, మార్టూరు రూరల్‌
తెలుగు ప్రజల భవిష్యత్తే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. బెంగళూరులోని ఎస్‌కేజీ కళ్యాణ మండపంలో పర్చూరు ప్రజలతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్వంసం, అరాచకం, దోపిడీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. 2024ఎన్నికల్లో టిడిపి, జనసేన, బీజేపీ కలయిక చారిత్రాత్మక మని అన్నారు. రాష్ట్రం ప్రగతి కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో హర్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా చంద్రబాబు పొత్తు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు టిడిపి, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు చెప్పారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, ధనుంజయరెడ్డిగా మారిందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి మాటల్లోనే విన్నాం అన్నారు. బీసీలకు టిడిపి పుట్టినిల్లు లాంటిందన్నారు. మొన్న జరిగిన జయహో బీసీ ద్వారా మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఇంత అరాచక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని వివరించారు. టిడిపిపై కేంద్రంలోని బీజీపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగిందని అన్నారు. అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించిందని అన్నారు. యువ ఓటర్లు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలన్నారు. వైసిపి పతనానికి నూతన ఓటరు ఓటే నాంది పలకాలన్నారు. పరిశ్రమలన్నీ పక్కదారి పట్టాయని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం 10ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. రాష్ట్రం గాడిలో పడాలన్న, యువతకు ఉపాధి లభించాలన్న చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.
ఏలూరికి ఘన స్వాగతం
బెంగళూరులో టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు నిర్వహించిన ఆత్మీయ సమావేశంకు పర్చూరు వాసులంతా ఏకమై తమ గళాన్ని వినిపించారు. టిడిపికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తొలుత ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావుకు ఘన స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బెంగళూరు టిడిపి ఫోరం పర్చూరు నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మణ్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమ్మి మహేష్, అనిల్, మధు, లక్ష్మీనారాయణ, రాఘవేంద్రరావు, సురేష్, రాజేష్, శివ, శివరాం, తిరుపతయ్య పాల్గొన్నారు.

➡️