వైసిపి ఇన్చార్జి మార్పుపై కలకలం

Dec 12,2023 00:25

ప్రజాశక్తి – పంగులూరు
అద్దంకి వైసిపి ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్యను ఆ పార్టీ అధిష్టానం బాధ్యతల నుండి తప్పించిందనీ కృష్ణ చైతన్య స్వగ్రామమైన పంగులూరులో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. ఆ పార్టీ కార్యకర్తలు, కృష్ణ చైతన్య అనుచరులు ఆలోచనలో పడ్డారు. ఇన్చార్జి పదవి నుంచి కృష్ణచైతన్యను తొలగించి ఆ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త హనిమిరెడ్డికి అప్పగిస్తున్నారన్న వార్త సోమవారం గుప్పుమన్ని. కృష్ణ చైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు. గతంలో అద్దంకి నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్‌లో చేరిన గరటయ్య వైఎస్ఆర్‌ మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసిపిలో చేరారు. వైసిపి తరఫున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు గరటయ్య కుమారుడైన కృష్ణ చైతన్యకు నియోజవర్గ ఇన్చార్జి బాధ్యతలను జగన్మోహన్‌రెడ్డి అప్పగించారు. తరువాత రెండేళ్లకు ఆయనకు ఇన్చార్జి పదవితో పాటు శాప్ నెట్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. గత 4సంవత్సరాలుగా కృష్ణ చైతన్య ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందున్నారు. గ్రామాల్లో నిత్యం తిరుగుతూ ప్రజల్లో ఉన్నారు. అయితే నియోజవర్గంలో కొంత మంది అతనికి వ్యతిరేకంగా జట్టు కట్టి అధిష్టానానికి పలుమార్లు వ్యతిరేకతను తెలిపారు. ఈ క్రమంలోనే కృష్ణ చైతన్యకు సీటు రాదనే ప్రచారం బాగా ఊపొందుకుంది. ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో కృష్ణ చైతన్య కొంత వెనుక పట్టు పట్టారని ప్రచారం ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇన్‌ఛార్జి బాధ్యతలనుండి కృష్ణ చైతన్యను తప్పించి హనిమిరెడ్డికి అప్పగిస్తున్నట్లు వార్తలు రావడం కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగేళ్ల కాలంలో కృష్ణ చైతన్య కరోనా సమయంలో ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రజలతోనే తిరిగాడని, ప్రజల్లోనే ఉన్నాడని, అలాంటి వ్యక్తిని తప్పించి మరొకరికి బాధ్యతలు ఇవ్వడం సరైనది కాదని అంటున్నారు. ఏది ఏమైనా అధిష్టానం నిర్ణయం ప్రకారం, పార్టీ ఎవరిని నియమిస్తే వారితోనే ఉంటామని కొంతమంది ప్రజాశక్తికి తెలిపారు.

➡️