దళిత నేత నీలం నాగేంద్ర ఫిర్యాదు : ఎస్సీ కమిషన్ ఆదేశంతో కేసు నమోదు చేసిన సీఐ కృష్ణయ్య

Mar 6,2024 01:05

ప్రజాశక్తి – అద్దంకి
దళిత మహిళ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన అగ్రకుల నిందితులపై సిఐ కృష్ణయ్య క్రైమ్ నెంబర్ 90/24గా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20న ఘటన జరిగితే మార్చి 4 కేసు నమోదు చేశారు. మాల మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య ఆధ్వర్యంలో ఆబోతు విమలమ్మ, ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం అద్దంకి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ తీసుకున్నట్లురు దారా అంజయ్య తెలిపారు. నేరం జరిగి 14 రోజులైన ఎస్సీ ఎస్టీ యాక్టులో లేని రూల్స్ చెప్పి సిఐ కేసు నమోదు చెయ్యలేదని అన్నారు. బాధితులు ఈ విషయాన్ని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీంతో నీలం నాగేంద్రరావు సీఐతో మాట్లాడారని అన్నారు. ఒకే వివాదంపై, ఒకే బాధితుడు రెండు వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి రెండో సారి ఇచ్చే ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ కేసు కట్టకూడదని సీఐ కొత్త చట్టం చెప్పారని అన్నారు. 107కింద బైండోవర్ చేపిస్తానని ఒకసారి, ట్రస్ పాస్ కింద కేసు కడతానని మరోసారి చెప్పారని అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ వస్తుందని, పంట నష్టం ఫోటోలు కూడా సిఐకి ఇచ్చి కేసు నమోదు చేయాలని నాగేంద్ర కోరారన్నారు. లీగల్ ఒపీనియన్ కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు పంపిస్తానని సిఐ కాలయాపన చేశారన్నారు. దీంతో బాధితురాలు విమలమ్మతో ఈనెల 1న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ వద్ద కేసు పూర్వాపరాలు, సీఐ వైఖరి గురించి నాగేంద్రం మాట్లాడి కేసు నమోదు చేయించాలని కోరారని అన్నారు. స్పందించిన ఎస్పీ చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్‌ను కేసు నమోదు చేయించాలని ఆదేశించారని అన్నారు. చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్ ఫోన్లో అద్దంకి సీఐని ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే, పిపి ఒపీనియన్ కోసం లెటర్ రాశానని చెప్పగా, పిపితో నీకేం పని, పీపీని నాతో మాట్లాడించమని, ఎస్సీ, ఎస్టీ కేసు రెండోసారి కట్టకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఆని నిలదీసారని అన్నారు. డీఎస్పీ దగ్గర కూడా సీఐ అగ్రకుల నిందితులకు వత్తాసు పలికి, క్రిమినల్ కేసు కట్టకుండా, భూ కబ్జాని భూ వివాదంగా మలిచి చీరాల ఆర్డీఓ కోర్టుకు పంపిస్తున్నానని అద్దంకి సీఐ చెప్పారని అన్నారు. ఆదివారం ఒంగోలు వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాదును కలిసి కృష్ణయ్య వైఖరిపై ఫిర్యాదు చేశానన్నారు. స్పందించిన చైర్మన్ విక్టర్ ప్రసాద్ సీఐకు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. ఒకే ఫిర్యాదుదారు రెండు కేసులు పెట్టకూడదని చెప్పావంట, ఏ రూల్ ప్రకారం కేసు కట్టకూడదో తనకు చెప్పాలని చైర్మన్ సీఐని ప్రశ్నించారు. తాను స్వతహాగా లాయర్నని, తనకు రూల్స్ తెలుసని, కేసు కట్టి ఎఫ్ఐఆర్ తన ఆఫీసుకు పంపాలని ఆదేశించారని అన్నారు. దీంతో 14రోజుల పాటు అగ్రకుల నిందితులపై కేసు కట్టకుండా అడ్డుపడిన అద్దంకి సీఐ దళిత నేత నీలం నాగేంద్రరావు ఫిర్యాదు, ఎస్సీ కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశాలతో గత్యంతరం లేక ఆబోతు విమలమ్మ పొలంలో పంట ద్వంసం చేసిన ఆలోకం హరిబాబు తదితరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని అన్నారు. అద్దంకి పోలీస్ స్టేషన్ ముందు బాధితులు విమలమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు, దళిత నాయకులు కాకుమాను రవి, రంజిత్, యరమోతు నారాయణ, యరమాల శ్రీనుతో కలసి అంజయ్య ఎఫ్ఐఆర్ కాపీని విలేకరులకు చూపించారు.

➡️