అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం మెట్టు దిగిరాకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

Dec 19,2023 23:50

ప్రజాశక్తి – రేపల్లె
అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె సందర్భంగా శిబిరం ఎదురు రోడ్డు మీదే వంట చేసి, అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్,హెల్పర్స్ కార్యదర్శి కె వాణి మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డున పడేసిన నేపథ్యంలో సమ్మె శిబిరాల వద్ద వంట చేసి తమ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాము చేస్తున్న పనికి వేతనం అడగడం నేరమన్నట్లు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించ కుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీలను భయపెట్టాలనుకోవడం విరమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కెవి లక్ష్మణరావు, కె ఆశీర్వాదం, కె రమేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు జ్యోతి, ఎన్ కృష్ణకుమారి, సునీత, నిర్మల, వై మేరీ, మణి పాల్గొన్నారు.


పర్చూరు : అంగన్‌వాడీల సమస్య పరిష్కారం అయ్యేవరకు తమ మద్దతు ఉంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ పేర్కొన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించ కుండా ఉంటే బుధవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిగిలిన ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మద్దతు ఇస్తామని వివరించారు. వంటా వార్పు చేసి అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, నాయకులు బి చిన్నదాసు, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.


భట్టిప్రోలు (చుండూరు) : అంగన్‌వాడి కార్యకర్తల డిమాండ్స్‌ నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. చుండూరు తహశీల్దారు కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీ సమ్మెకు టిడిపి, జనసేన పార్టీలు మంగళవారం మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు అందిస్తానని నమ్మించి గెలుపొంది నేడు సమస్య పరిష్కరించకుండా కేంద్రాలను తెరిపించేందుకు సచివాలయ సిబ్బందితో ప్రయత్నించటం దారుణమని టిడిపి అధ్యక్షులు గుద్దేటి ఎల్లారెడ్డి ఆరోపించారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం అంగన్‌వాడిలకు గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు. టిడిపి, జనసేన మద్దతుగా నిలుస్తుందని అన్నారు. అంగన్‌వాడీలు వినూత్న రీతిలో కూరగాయలు అమ్మి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు తమ్మాశివారెడ్డి, నాయకులు మర్రి వెంకట్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసరెడ్డి, విఎస్ఆర్ ప్రసాద్, దేవరపల్లి ఆంజనేయులు, జనసేన నాయకులు శ్రీరామ్ మూర్తి, బొడియ, సిఐటియు నాయకులు బొనిగల అగస్టీన్ పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడిల సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరింది. అంగన్‌వాడి కేంద్రాలను ఏదో విధంగా తెరిపించాలనే దృక్పథంతో ప్రభుత్వం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి చేయడంతో వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది కలసి పలుచోట్ల అంగన్‌వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పెద్దపులివరు అంగన్‌వాడి కేంద్రంలో అధికారులు తాళాలు పగల కొట్టేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు, ఆయాలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకుండా కేంద్రాలు తెరవడానికి వీలు లేదని, సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని, అధికారులు వచ్చి బలవంతంగా తాళాలు పగలకొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు జరిగిన సంఘటనను ఫోటోలు తీసుకుని వెనుతిరిగి వెళ్లారు. భట్టిప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. సిఐటియు నాయకులు జి సుధాకర్, మురుగుడు సత్యనారాయణ, జి నాగరాజు, రైతు సంఘం కార్యదర్శి కె రామస్వామి పాల్గొన్నారు.
నిజాంపట్నం : అంగన్‌వాడిల సమ్మె 8వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం అంగన్‌వాడిలు భిక్షాటన చేశారు. సమ్మె శిబిరానికి యుటిఎఫ్ నాయకులు బాపయ్య, గణేష్‌రావు వచ్చి పూర్తి సంఘీభావం ప్రకటించారు. పోరాటానికి మద్దతుగా ఉంటామని అన్నారు. తర్వాత భిక్షాటనలో అంగన్వాడి వర్కర్స్ మట్లాడుతూ సంక్షేమ ప్రభుత్వమని చెప్తు మహిళలను రోడ్డున పడేసిందని దుర్మార్గపు ప్రభుత్వమని ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలవంతంగా తెరవాలని తహశీల్దారు, ఎంపిడిఒ, సచివాలయ సిబ్బందిని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలందరికీ తెలియపరుస్తామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ తాళాలు పగులగొట్టలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజేశ్వరి, ధనలక్ష్మి, సిఐటియు నాయకులు శివశంకర్ పాల్గొన్నారు,
చెరుకుపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వంట వార్పు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో చైతన్య, సంతోష్ కుమారి, మంగ, వాణి పాల్గొన్నారు.
కారంచేడు : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. వంట చేసుకుని భోజనం చేశారు. స్వర్ణ, దగ్గుబాడు, కారంచేడు, కొంకలమర్రు గ్రామాల నుండి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తక్షణమే డిమాండ్స్‌ పరిష్కారం చేయాలని కోరారు. మొండి వైఖరి విడనాడాలని తెలంగాణతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు. ఈరోజు ధర్నాకు మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల నాయకులు బి శంకర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి అనిత, శ్రీలక్ష్మి, రాధా, మేరీ, మరియమ్మ, సిఐటియు నాయకులు పి కొండయ్య పాల్గొన్నారు
చీరాల : అంగన్‌వాడీ యూనియన్ సమ్మె 8వ రోజు జరిగింది. ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగిన ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవైపు మంత్రి బొత్స సత్యనారాయణ తాళాలు పగలగొట్టమనలేదని స్టేట్మెంట్ ఇస్తూ ఇంకోవైపున తాళాలు పగలగొడుతున్నారని సిఐటియు నాయకులు అన్నారు. ప్రభుత్వం దొంద వైఖరి అవలంబిస్తుందని అన్నారు. సిఎం జగన్‌ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. సమ్మెలో ఎపి వెలుగు విఒఏలు సమ్మెకు మద్దతు తెలిపారు. తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాలో న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని నినాదాలు చేశారు. అంగన్‌వాడీలు కోలాటం వేసి నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం వసంతరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖఎలిజిబిత్‌, పి ప్రమీల, జి సుజీవన, సులోచన, ఎ బ్యూల, అనిత, జ్యోతి పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్‌ : అంగన్‌వాడీల సమ్మె 8వ రోజు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె సందర్భంగా చిత్రలేఖనం వేశారు. అంగన్‌వాడీలు అక్కడే వంట చేసుకుని భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా నాయకులు నలతోటి బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను కట్టు బానిసల్లాగా చూస్తుందని అన్నారు. దొంగల్లాగా తాళాలు పగలగొట్టి సెంటర్స్ ను తెరవడం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు, అంగనవాడి ప్రాజెక్టు లీడర్లు బి సరళ, లక్ష్మీ, కుమారి, అనురాధ, శ్రీలక్ష్మి, శ్రీదేవి, రాజ్యం, రమాదేవి, తులసి, జ్యోతి పాల్గొన్నారు.
నగరం : అంగన్‌వాడిల సమ్మె పరిష్కరించాలని కోరుతూ పోర్లుదండాలతో విన్నుతంగా నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ నాయకులు డి జ్యోతి మాట్లాడుతూ తాము గ్రామస్థాయిలో పేదలకు చిన్న పిల్లలకు, అనేక సేవలు చేస్తున్న తమ పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు నళిని, రజిని, భవాని, సుధా, అరుణ పాల్గొన్నారు
పంగులూరు : న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఏనిమిదోరోజుకు చేరింది. అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. అంగన్‌వాడీలను బెదిరించి, తాళాలు పగలగొట్టి, అంగన్‌వాడి కేంద్రాలను తెరిపిస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లు, విఆర్వోలతో కేంద్రాలు నడపటం అంత సులభమైన పని కాదని అన్నారు. తక్షణమే తమ డిమాండ్లను పరిశీలించి, పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి పాల్గొన్నారు.
అద్దంకి : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు వంట, వార్పు చేవారు. డిమాండ్స్‌ పరిష్కారం చేయాలని కోరుతూ వారం రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు పోరాటం ఉదృతం చేస్తున్నట్లు సిఐటియు నాయకులు తిరుపతిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్స్‌తో చర్చలు జరపాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, భీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని సిఐటియు నాయకురాలు జి శారద కోరారు.

➡️