ప్రభుత్వం దిగిరాకుంటే పోరు ఉదృతం

ప్రజాశక్తి – బాపట్ల
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 19రోజులుగా అనేక రూపాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం కనికరించకపోతే పోరును ఉదృతం చేస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె శిబిరం నుండి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా తమ నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ మజుందార్, బీసీ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు శైలశ్రీ, హేమమాలిని, లత, గీత, కుమారి పాల్గొన్నారు.


పంగులూరు : న్యాయమైన కోర్కెల సాధన కోసం గత 18రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల పోరాటానికి కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం మద్దతు తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వచ్చి శనివారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు సమరశీల పోరాటం చేస్తున్నారని అభినందించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా ఇంతకాలం మొండిగా ఉండటం సరైనది పద్దతి కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. అంగన్‌వాడీలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.


రేపల్లె : అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. సమ్మెలో తమ సేవలను ఇతరులకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ డిమాండ్స్‌ పరిష్కారం చేయాలని ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని సచివాలయాలు, ఇతర ఉద్యోగులకు తమ విధులు పురమాయించ వద్దని కోరుతూ సచివాలయంల్లో లేఖలు ఇచ్చారు. సమ్మె శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు ఆర్ మహేష్, జనాసేన నాయకులు రేపల్లె జానకి, దేవగిరి శంకర్ మాట్లాడుతూ అంగన్‌వాడీల డిమాండ్స్‌ న్యాయమైనవని అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపాలని కోరారు. సీఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మంత్రులు లేని నేపథ్యంలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచకుండా పెంచినట్లు ప్రకటనలు చేయటం సిగ్గుచేటని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి కె వాణి, నాయకులు ఎన్ కృష్ణకుమారి, నిర్మల, జ్యోతి, శివలక్ష్మి, రజిని, దీప్తి విజయలక్ష్మి, సిఐటియు నాయకులు జె ధర్మరాజు, బి అగస్టిన్ పాల్గొన్నారు.


అద్దంకి : జగన్ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలను అన్ని రకాల అణగదొక్కెందుకే ప్రయత్నిస్తుందని సిఐటియు నాయకురాలు జి శారద అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద 19వ రోజు అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలు నిర్వహించారు. సిఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటివరకు వినూత పద్ధతుల్లో అనేక విధాలుగా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నప్పటికీ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమైన విషయమని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పించిన అమలు చేయాలని అన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు ప్రజాశక్తి ఇన్‌ఛార్జి బి విజయకుమార్‌ మద్దతు ప్రకటించారు. సిఐటియు నాయకురాలు జి శారద, అనిత ధన లక్ష్మి, సుబ్బాయమ్మ, కళావతి, పూర్ణ పాల్గొన్నారు.


చుండూరు : అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షా భిశిరాన్ని వైసిపి ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు సందర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్స్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. వీలైనంత తొందర్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని చెప్పారు. దీక్షకు విరామం ప్రకటించి విధులలో చేరాలని కోరారు.


సంతమాగులూరు : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె, దీక్షలు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వదద్ద శనివారం కొనసాగించారు. మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు. కనీస వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడిల జీతాలు పెంచి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్చలకు పిలుస్తున్న ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేస్తా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలల న్యాయమైన డిమాండ్స్ నెరవేరేవరకు ధర్నాలు కొనసాగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మస్తాన్ బి, శ్రీదేవి, ఎస్తేరా రాణి, నిర్మల, ఆదెమ్మ, రమణ, మల్లేశ్వరి పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం దీక్ష చేశారు. దీక్షా శిభిరం నుండి పంచాయితీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పంచాయితీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత 19రోజులుగా తాము ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి కోటా శ్రీనివాసరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమాదేవి, సూర్యలక్ష్మి, గృహలక్ష్మి, ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్ పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె శనివారం 19వ రోజు కొనసాగించారు. స్థానిక సమ్మె శిబిరం నుండి గ్రోమోర్, శివాలయం సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వెనుకనున్న మహాత్మా గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొనిగల సుబ్బారావు, సెక్టార్ లీడర్స్ వనజ, బాలకాశి, భాగ్యం, సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.


ఇంకొల్లు రూరల్‌ : మండలంలోరని దుద్దుకూరు గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తలు 19వ రోజు మోకాళ్ళపై కూర్చొని, చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. అంగన్‌వాడీల పోరాటానికి గ్రామ పెద్దలు మద్దతు ప్రకటించారు. శిబిరంలో ఉన్న కార్యకర్తలకు మంచినీరు, శీతల పానీయాలు అందజేశారు. మాజీ జడ్పిటిసి వీరగంధం ఆంజనేయులు అంగన్‌వాడి కార్యకర్తలకు అరటి పళ్ళు అందజేశారు. ఎన్ని రోజులైనా తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల వద్దకు వెళ్లి తమ సమస్య ప్రజలకు తెలుపుతామని అంగన్‌వాడీలు ప్రకటించారు. ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి నాగండ్ల వెంకటరావు, ప్రాజెక్టు లీడర్ దేవమణి, సరళ, శ్రీదేవి, పి హేమలత, కే పద్మ, ఎస్ బుల్లమ్మాయి, ఎస్‌కె కరీమున్నీసా, అన్నమ్మ, కోమలి, అనిత, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.


చీరాల : సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ సెంటర్లు నడవడానికి రావద్దని, ఉద్యోగుల మధ్య ఐక్యత కావాలని కోరుతూ నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులకు అర్జీలు ఇచ్చారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రేఖ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. చిరుద్యోగుల పట్ల సానుభూతితో డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.20వేల కోట్లు ఆదానీ కంపెనీకి కట్టబెడుతుందని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. ఈ ప్రభుత్వం ఎవరివైపు ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పి ప్రమీల, ఎ బ్యూలా, సులోచన, శిరీష, దుర్గ పాల్గొన్నారు.


నగరం : అంగన్‌వవాడిల సమ్మెలో శనివారం కొనసాగించారు. అంగన్‌వాడి సేవలను ఇతరులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అన్నీ సచివాలయాలో తమ విధులును ఇతరులకు పురమాయించొద్దని కోరుతూ లేఖలు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కె రత్నకుమారి, రాజ్యలక్ష్మి, కృష్ణకుమారి, జ్యోతి, నళిని పాల్గొన్నారు.

➡️