రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించిన వైసీపీని సాగనంపుదాం : శాసనసభ్యులు అనగానీ సత్యప్రసాద్

Jan 6,2024 00:20

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి, సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ఎంఎల్‌ఎ అనగానీ సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి తప్ప అభివృద్ధి శూన్యంగా మారిందని అన్నారు. ఏ గ్రామంలో చూసినా వైసీపీ ప్రభుత్వాన్ని చీదరించుకునే స్థాయికి వెళ్ళిందంటే పరిపాలన ఏవిధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. సీఎం జగన్‌ హాయంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. 2024ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రతి కార్యకర్త ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమాలుంటే సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. టిడిపి పాలనలో 150పథకాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించామని అన్నారు. 56కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన వైసిపి ప్రభుత్వం ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదని ఆరోపించారు. ఉద్యమాల పేరుతో ప్రజలను మోసాగించి వ్యక్తి గత లబ్ధి పొందిందన నాయకులు బిసిల హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ ఇలా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేపట్టటం ప్రభుత్వ చేతగాని పాలనా తీరుకు నిదర్శనం అన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బెదిరించాలని చూడటం అవివేకం అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2018జూలైలోనే అంగన్‌వాడీలకు రూ.10,500 వేతనం ఇచ్చారని గుర్తు చేశారు. టిడిపి పాలకులు ఎన్టీ రామారావు, చంద్రబాబు ప్రజాకర్షణ పాలన అందించారని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వైసిపి మోసపు మాటలు నమ్మలేక ప్రజలు స్వచ్ఛందంగా టిడిపిలోకి వస్తున్నారని అన్నారు. ప్రతిఒక్కరికి టిడిపి ఆహ్వానం పలుకుతుందని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్న కాలంలో నియోజకవర్గం అభివృద్ది చెందినట్లు తెలిపారు.

➡️