నల్ల దుస్తులతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Dec 31,2023 02:13

ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంకు 5వ రోజు స్థానిక మున్సిపల్ కార్మికులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. పారిశుధ్య కార్మికులు చేస్తున్న పోరాటానికి చేతివృత్తిదారుల సమన్యాయ కమిటీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు, చేతివృత్తి దాసురుల సమన్వాయ కమిటీ జిల్లా కన్వీనర్ పి కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఒకవైపు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపున పోటీ కార్మికులు తెచ్చి పని చేయించాలని కమిషనర్లపై ఒత్తిడి చేసి కార్మికులను బెదిరించటం సరైన చర్య కాదని అన్నారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కార్మికులపై బెదిరింపు చర్యలు హేయమైన చర్యని అన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు నూతలపాటి రాజు, కార్యదర్శి ఎండ్లూరు సింగయ్య, కోశాధికారి మానికల శంకర్, బడుగు కుమారి, బి విజయమ్మ, తిరుపతమ్మ, యశోద, సుబ్బమ్మ, ఆంజనేయులు, రేణుమాల నసాగరాజు, గూడూరు శిరీష, పద్మ పాల్గొన్నారు.


అద్దంకి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు పి తిరుపతిరెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు 5వ రోజు వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ సిఎం అయిన తరువాత కార్మికుల సమస్యలు అధికమయ్యాయని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోవాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె శిభిరం వద్దనే వంట చేసుకుని రోడ్డుపైనే భోజనాలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, కార్మికులు పి ఆదాం, భీష్మ, అంజమ్మ పాల్గొన్నారు.

➡️