నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు : ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

Mar 11,2024 23:59

ప్రజాశక్తి – బాపట్ల
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు ఈనెల 12నుండి ప్రారంభం కానున్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అన్ని మసీదులు ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. నెలరోజులపాటు ఈ దీక్షలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. సమత, మమతల సమ్మిళితాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ రంజాన్ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించడం ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల వంక దర్శనంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.. ప్రపంచంలోని ముస్లింలు అతి పవిత్రంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్ వేడుక. నెలవంక దర్శనంతో దీక్షలు చేపట్టి తిరిగి నెలవంక దర్శనంతో దీక్షను విరమిస్తారు. నెలరోజుల ఉపవాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం కావడంతో ఏడాదిలో ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ఒక రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. రంజాన్ మాసం అంటే ఇది బాహ్య సౌందర్యాలకు తావివ్వక, ఆత్మ సౌందర్యానికి పట్టం కట్టే అరుదైన పండుగ. ఒక మహత్తరమైన వేడుక. ఎదనిండా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే సంతోషాల పండగ. సంబరాల వేదిక. వ్యక్తిని అతని వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే కఠినతరమైన ఆధ్యాత్మిక మార్గం. నెల రోజులపాటు ఉపవాసం ఉన్న వారిలో సప్త వ్యసనాలను తొలగించి ఇతరుల పట్ల దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యాలను పెంపొందిస్తాయని నమ్ముతారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని సమాజానికి ఉపయోగపడే సద్గుణాలను నింపి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇదే ఇస్లాం మూల సూత్రాల్లో ప్రధానమైన లక్ష్యం. నెలరోజుల పాటు ఉపవాసం ఉండేవారు కఠోరమైన దీక్షతో దీక్షలను చేపడతారు. చెడు మాట్లాడటం, చెడు వినటం, ఇతరులను దూషించటం, వంటి పనులు చేయకూడదు. ప్రతి రోజూ ఐదుపూటల నమాజ్ చేయటంతో పాటు రాత్రి వేళల్లో తరావీహ్ నమాజ్ తప్పనిసరిగా పాటిస్తారు. ఈ నెలలో చేసే నమాజులకు, పవిత్ర కార్యాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పవిత్ర ఖురాన్ పేర్కొంటోంది. ప్రతి ముస్లిం విధిగా రంజాన్ ఉపవాస దీక్షలు పాటించాలని పేర్కొంటున్నారు. తప్పనిసరి అయితే తప్ప దీక్షను విరమించ కూడదని ఖురాన్ పేర్కొంటోంది. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవారికి సమాజ సేవ పట్ల అంకితభావం, నిరుపేదల పట్ల సేవ చేయాలనే సంకల్పం, సన్మార్గంలో నడిచే ఒక అద్భుత అవకాశం ఈ ఉపవాసాల దీక్షల వల్ల కలుగుతుందని చెబుతారు. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభ సందర్భంగా బాపట్లలోని వివిధ మసీదులు విద్యుత్ దీపాలతో అలంకరించి అందంగా ముస్తాబుచేశారు.

➡️