ఆర్టీసీ స్థలం ఆక్రమణ కట్టడి చేయండి

Dec 8,2023 22:41

ప్రజాశక్తి – అద్దంకి
ప్రయాణికులకు నీడ ఇస్తున్న ఏళ్ల నాటి మహా వృక్షాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో హడావుడిగా జెసిబితో తొలగించి స్థలాన్ని చదును చేశారు. చెట్టు తొలగించడాన్ని పట్టణ అభివృద్ది కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు ప్రశ్నించారు. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే రోడ్డులో ఏ నిర్మాణం కోసం చెట్టు తొలగించారని ప్రశ్నించారు. ఆర్టీసీ డిఎం రామ్మోహనరావుకు ఫోన్ చేయగా తనకు తెలిదని డిఎం చెప్పినట్లు తెలిపారు. ప్రజాసంఘాలు, స్థానిక ప్రజల ఆందోళన అనంతరం ఆర్టీసీ డిఎం బి రామమోహనరావు, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెట్టు తొలగించిన ప్రాంతంలో కొలతలు తీయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ కొలతలకు, నిర్మాణ అనుమతులకు మున్సిపాలిటీకి సంబంధం లేదని, యుడిఎ పరిధిలో ఉన్నందున ఒంగోలు వారిని సంప్రదించాలని సమాధానం చెప్పారు. అక్కడి స్థలంలో నిర్మించే స్థలానికిఇ 20అడుగులు ఆర్టీసీ స్థలం ఇవ్వాలని కమిషనర్‌ కోరడంతో తనపరిధిలో 10అడుగులు మాత్రమే ఇచ్చే అధికారం ఉందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అనుమతి లేకుండా ఎలా నిర్మాణాలు చేస్తారో ప్రజలు గమనించాలని సీనియర్ అడ్వకేట్ వజ్రాల అంజిరెడ్డి అన్నారు. రిలయన్స్ మార్ట్ సిబ్బంది రఫ్ ప్లాన్ తీసుకొచ్చి దాని ప్రకారం కొలతలు పెట్టుకొని రూప్స్ వేశారు. రోడ్డు వైడెన్ ఫైనల్ కొలతలు తేలకుండా కొలతలు వేయడానికి వీల్లేదని ప్రజా సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. ప్రజాసంఘాల అభ్యంతరం తర్వాత రూప్స్ తొలగించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిత్యం ట్రాఫిక్ జామవుతున్న రోడ్డులో భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రమాదకరంగా ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను వెనక్కి జరపాలని కోరారు. కార్యక్రమంలో కావూరి రఘుచంద్, సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సోమేపల్లి రాము, మలాది అంజి రత్తయ్య, పెంట్యాల సుబ్బయ్య, గోరంట్ల శ్రీను, అమర్నేని శీను పాల్గొన్నారు

➡️