అంగన్వాడి సమస్యలపై సమ్మె నోటీసులు

Nov 23,2023 00:14

ప్రజాశక్తి – భట్టిప్రోలు
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8నుండి నిరవ నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు అమర్చూరు ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ నాయకులు బొనిగల ఆగస్టీన్ తెలిపారు. సిడిపిఓ విజయలక్ష్మికి సమ్మె నోటీసులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు యాప్‌ల వత్తిడితో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని కోరారు. 2017నుండి టీఏ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు నెలల నుండి అంగనవాడీ కేంద్రాల అద్దె బకాయిలు అందజేయాలని అన్నారు. కేంద్రాలకు నాణ్యమైన సరుకును సరఫరా చేయాలని అన్నారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్‌కై వయో పరిమితిని 56ఏళ్లకు పెంచాలని కోరారు. రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిఐటియు జిల్లా నాయకులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ పని చేసే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే తరహాలో పథకాలు నివారిస్తున్నారని అన్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేసేటప్పుడు మాత్రం స్కీం వర్కర్లుగా పేర్కొంటూ ప్రభుత్వం నిరాకరిస్తుందని విమర్శించారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.5లక్షలకు పెంచాలని అన్నారు. ఆఖరి వేతనంలో సగం పెన్షన్‌గా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు ఈ బసవమ్మ, ఎం కామేశ్వరి, ఆర్ సావిత్రి, సుజాత, పద్మావతి, విజయ పాల్గొన్నారు.

➡️