దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

Mar 2,2024 23:37

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ బాషా అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. మహ్మద్ బాషా మాట్లాడుతూ జన్యుపరమైన కారణాల వల్ల అంగవైకల్యంతో ఉన్న వారి సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. వికలాంగులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేవాళ్లు హామీలు తప్ప పరిష్కారం వైపు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, యంత్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులకు నివేశస్థలాలు ఇవ్వాలని అన్నారు. పెరిగిన ధరలకు కనుగుణంగా వికలాంగుల పెన్షన్‌ రూ. 6వేలకు పెంచాలని కోరారు. గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ.5లక్షలకు పెంచాలని అన్నారు. గృహాలకు 300యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని తీర్మానించారు.
నూతన కమిటి ఎంపిక
వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ బాషా, సాయి, నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా రాజుగారిపాలెం, మార్టూరు గ్రామాలకు చెందిన ఉప్పలపాటి అచ్యుత రామరాజు, గడ్డం జాన్, కోశాధికారిగా ఆవుల రత్తయ్య, సభ్యులుగా మీరావలి, కోట వెంకట సుబ్బారావు, కొమెర శ్రీనివాసరావు, వేళ్ళ వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జల్లి కోటేశ్వరరావు, మండలంలోని వికలాంగులు పాల్గొన్నారు.

➡️