ప్రజా సమస్యల ప్రస్తావన ఊసే లేదు

Dec 31,2023 02:15

– సమావేశానికి అధికార వైసిపి కౌన్సిలర్లు డుమ్మా
– అరగంటలో ముగిసిన కౌన్సిల్ సమావేశం
ప్రజాశక్తి – రేపల్లె
పట్టణ ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం లేదు. పట్టణ అభివృద్ధిపై చర్చలు లేవు, సీజనల్ యాక్షన్ ప్లాన్ తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై ప్రణాళికలేమీ పట్టించుకోలేదు. అజండాలోని అంశాలు, వాటిలో ఉన్న లోటుపాట్లు పరిశీలించాల్సిన చేయలేదు. అంతా ఏకపక్షంగా అధికార పార్టీ నేతలు అజండాలో పాస్‌ చేశారు. ఇదీ మున్సిపల్‌ కౌన్సిల్ తీరు. కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ కట్టా మంగ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఉదయం 11గంటలకు కౌన్సిల్ సమావేశం జరగవలసి ఉండగా ఆలస్యంగా 12గంటలు దాటిన తర్వాత ప్రారంభమైంది. అజండాలో తెలిపిన విధంగా మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సమావేశ మందిరంలోనికి చేరుకున్నారు. మరో 10నిమిషాలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిల్ హల్లోకి వచ్చారు. పురపాలక సంఘలోని 28వార్డుల్లో 26మంది అధికార పార్టీ సభ్యులు ఉండగా, ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిర్లలో అత్యధికంగా దుమ్మా కొడుతుండటం గమనార్హం. ఇంతలో అజండాలోని 48అంశాల్లో రెండు అంశాలు పోడియం వద్ద చదువుతున్న మున్సిపల్ ఉద్యోగిని వైస్ చైర్మన్ తూనుగుంట్ల కాశీ విశ్వనాథ గుప్త ఆపమని సూచించి అజెండాలోని 48అంశాలను సభ్యులు ఆమోదించినట్లు ప్రకటించి టీ తాగేలోపే సమావేశం ముగిసిందని అన్నారు. దీంతో కాలక్షేపం కోసం కౌన్సిల్ మీటింగ్ వచ్చినట్లు ఉందని, ప్రతిపక్షం లేకపోతే ప్రేక్షక పాత్రేనని కొందరు కౌన్సిలర్లు పెదవి విరిచారు. చాయ్, బిస్కెట్లకోసం ఇత దూరం రావాలా అంటూ కౌన్సిల్ హాల్ నుండి సభ్యులు బయటకు వచ్చారు. కేవలం అరగంటలోనే సమావేశం ముగిసింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విజయ సారధి, డిఈ శివరామకృష్ణ, ఎఈ రోహిణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️