జగన్ ముద్దు ఆమంచి వద్దు

Nov 28,2023 23:54

– ఆమంచి కృష్ణమోహన్ పద్ధతి మార్చుకో
– చిన్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మ రెడ్డి విమర్శ
ప్రజాశక్తి – చిన్నగంజాం
పర్చూరు వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న చీరాల మాజీ ఎంఎల్‌ఎ ఆమంచి కృష్ణమోహన్ తన పద్ధతి మార్చుకోవాలంటూ ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి బహిరంగంగా హెచ్చరించారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీలో జగనన్న ముద్దు, ఆమంచి వద్దు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ బ్రహ్మరెడ్డి ఇంటి నుండి చిన్నగంజా మార్కెట్ సెంటర్, కొత్తపాలెం రైల్వే గేట్ సెంటర్ గుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంకమ్మరెడ్డి మాట్లాడుతూ ఇన్‌ఛార్జిగా వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ ఆ విషయాన్ని మరిచిపోయి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తనను, బ్రహ్మారెడ్డిని దూషించే పనే పెట్టుకున్నారని అన్నారు. 2014లో టిడిపిని ఎదుర్కొని చిన్నగంజాం మండలాన్ని వైసిపి తరఫున నికరంగా నిలబడి గెలిపించామని అన్నారు. అలాంటి తమను విస్మరించి టిడిపి కోవర్టులను 50మందిని వెంటనే వేసుకొని తూతు మంత్ర కార్యక్రమాలు నిర్వహించి పబ్బం కడుపుకుంటున్నారని ఆమంచిపై విమర్శించారు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గెలుపు, ఓటములను నిర్ణయించేది చిన్నగంజాం మండలమేనని తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పెద్దలను కలుపుకొని పోవాలని ఆమంచికి హితవు పలికారు. 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనంలో కూడా చీరాల వంటి చిన్న నియోజకవర్గంలో 17వేల ఓట్లతో ఓడిపోయిన కృష్ణమోహన్ స్థాయి అర్థం చేసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. వైసిపిపై అభిమానంతో వచ్చే ప్రజలు తమ వేదిక ముందు ఉన్నారని, అవసరాల కోసం, ఇబ్బంది పెడతారనే భయంతో ఉండేవాళ్లే ఆమంచి వెంట ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఆసోది భాగ్యలక్ష్మి, కొత్తపాలెం సర్పంచి బ్రహ్మారెడ్డి, పెద్దపల్లిపాలెం సర్పంచి, మోటుపల్లి సర్పంచి వడ్లమూడి సాంబశివరావు, ఎంపీటీసీ తిరుపతిరావు పాల్గొన్నారు.

➡️