కార్మికులు సంక్షేమమే లక్ష్యం : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు

Jan 27,2024 00:58

సీఐటీయులో చేరిన మునిసిపల్ కార్మికులు
ప్రజాశక్తి – చీరాల
మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న 120మంది కార్మికులు, క్లాప్ డ్రైవర్లు శుక్రవారం సిఐటియు సంఘంలో చేరారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విస్తృత సమావేశం స్థానిక మున్సిపల్ చిల్డ్రన్స్ పార్క్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16రోజుల పాటు మున్సిపల్ కార్మికులు వీరోచితంగా పోరాడిన ఫలితంగా అనేక విజయాలు సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాల్లో క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ కు రూ.15వేల నుండి రూ.21వేలకు జీతం పెరిగిందని తెలిపారు. శానిటేషన్ డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు రూ.18,500 నుండి రూ.24500కు జీతం పెరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.75వేలు, ఎక్స్‌గ్రేషియో కింద చెల్లించే సాధారణ మృతికి రూ.2లక్షలు, ప్రమాద మృతికి చెల్లించే రూ.5లక్షలను రూ.7లక్షలకు, దహన సంస్కారాలకు రూ.15వేల నుండి రూ.20వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురి చేయబడిన ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ జీతాల చెల్లింపుకు 9మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిఓఆర్‌టి నంబర్ 30లో అన్యాయం జరిగిన వాటర్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, మేస్త్రీలకు జీఒను సవరించి న్యాయం చేస్తామని ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. 16 రోజుల సమ్మె కాలం జీతంతో పాటు కార్మికులపై మోపిన పోలీస్ కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. ఇవన్నీ కార్మికుల పోరాట విజయాలని అన్నారు. ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలు అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కార్మికుల ప్రయోజనాల కోసం మరో దశ పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు స్కిల్డ్, సెమి స్కిల్డ్ జీతాలు కోసం పోరాడాలని అన్నారు. సమావేశానికి సిహెచ్ వీరస్వామి అధ్యక్షత వహించగా సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు, మునిసిపల్ ఫెడరేషన్ పట్టణ కమిటీ నాయకులు ఎన్ రాజు, వై సింగయ్య, జి ఇమ్మానియేల్, శంకర్ పాల్గొన్నారు.

➡️