విభజన హామీల మాటేమిటి : జెవివి

May 10,2024 00:05 ##citu #bapatla

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్ర విభజన జరిగి దశాబ కాలం పూర్తయినా విభజన హామీలు అమలు జరగలేదని, ఆ హామీల మాటేమిటని జెవివి జిల్లా అధ్యక్షులు వై భాస్కరరావు ప్రశ్నించారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో జెవివి ఆధ్వర్యంలో పీపుల్స్ మ్యానిఫెస్టో రాజకీయ పార్టీలను జెవివి కోరుతుందనే అంశంపై జెవివి ప్రచురించిన పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ళ కాలంలోనే విభజన హామీలు నెరవేర్చలేదని అన్నారు. చట్టం చెబుతున్నప్పటికీ ఏ హామీ పూర్తిస్థాయిలో అమలు జరగలేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, 9కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు వంటి కీలకమైన హామీలతో పాటు చట్టంలో ప్రతిపాదించిన వివిధ అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గడువు ముగిసే సమయం దగ్గర పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలుగా మారిన చట్టబద్ధ హామీల సాధన అమలుపై తక్షణమే సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాదులో పదుల సంఖ్యలో పరిశోధన సంస్థలుండగా, నవ్యాంధ్రకు ఒక్కటి కుడా మంజూరు కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన ఈ ఎజెండాపై రాజకీయ పార్టీలు తమ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, జెవివి సీనియర్ సభ్యులు నూతలపాటి కోటేశ్వరరావు, జెవివి కర్లపాలెం మండల అధ్యక్షులు ఎన్ కళాధర్, బాపట్ల పట్టణ అధ్యక్షులు జి కోటిలింగాచారి, ఐద్వా జిల్లా నాయకురాలు టి సుభాషిని పాల్గొన్నారు.

➡️