ఇండియా వేదికను గెలిపించండి : జెడి శీలం

May 3,2024 00:47 ##congress #jdseelam

ప్రజాశక్తి – రేపల్లె
దేశ సమగ్రతకు, ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తూ రాక్షస శక్తిగా అవతరిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఇండియా వేదికగా ఏర్పడ్డారని కాంగ్రెస్‌ బాపట్ల ఎంపీ అభ్యర్థి జెడి శీలం తెలిపారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ విధానాలు దేశ ఉనికికే ప్రమాదకరమని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే ఓ ఫాసిస్టు సిద్ధాంతం బిజెపి వెనుక ఉందన్నారు. దేశంలో హిందు రాజ్య స్థాపన ధ్యేయంగా బిజెపి మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని అన్నారు. సమానత్వాన్ని రూపుమాపి సనాతన మనుధర్మాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తోందని అన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అడ్డుతొలగించుకుంటే మనుధర్మాన్ని స్వేచ్ఛగా అమలు చేయాలనేదే బీజేపీ వ్యూహమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేసి నియంతృత్వ రాజ్యంలా దేశాన్ని మార్చాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని హెచ్చరించారు. ఆర్థిక దోపిడీని విశృంఖలం చేసేందుకు పూనుకుందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టిందన్నారు. వాక్‌స్వాతంత్య్రాన్ని హరించేలా బీజేపీ వ్యవహరిస్తోందని, బీజేపీని ఓడించడం ద్వారా దేశ ఐక్యత సాధ్యమన్నారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రకటించిన మోడీ, ప్రధాని అయిన తర్వాత మన చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని అన్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తామన్న బిజెపి విధానాలు అర్ధం చేసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా తనను, బాపట్ల ఎంపిగా జెడి శీలంను గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ విధానాల కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, సిపిఐ నాయకులు నాగాంజనేయులు, గోట్టుముక్కల బాలాజీ, డాక్టర్ గోపీనాథ్, చిగురుపాటి భాస్కరరావు, గూడూరి సీతామహాలక్ష్మి, రత్నశ్రీ పాల్గొన్నారు

➡️