వైసీపీ నేతలు నిజాలు మాట్లాడాలి : బత్యాల

Nov 22,2023 16:19 #Annamayya district

ఓటర్ వెరిఫికేషన్ పై చర్చకు సిద్ధమా..?
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : కనీస అవగాహన లేక నోటికొచ్చినట్లు మాట్లాడకుండా వైసీపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు తెలియజేశారు. టిడిపి నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ బత్యాల చెంగలరాయుడు బుధవారం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బత్యాల మాట్లాడుతూ మహానాడు సభలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మినీ మేనిఫెస్టోను ప్రకటించిందని, మేనిఫెస్టో ప్రకారం ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ ప్రతి ఓటరును కలిసి తమ మేనిఫెస్టోను వివరించి షూరిటీ పత్రాలు అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా టిడిపి క్లస్టర్ ఇంచార్జి మిరియాల జ్యోతి ఇటీవల పట్టణ పరిధిలోని ఆకుల వీధిలో ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తుకు గ్యారెంటీ-బాబు షూరిటీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు అడ్డుకొని మహిళా కార్యకర్త పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఈ చర్యను తాను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. ఓటర్ వెరిఫికేషన్, బాబు షూరిటీ కార్యక్రమాలలో తాము ప్రజల వద్ద ఆధార్ కార్డు గాని, ఓటర్ కార్డు గాని సేకరించలేదని తెలిపారు. నేడు ప్రతి నిత్యావసర కార్యక్రమాలకు ఓటీపీ అనేది సర్వసాధారణమని అన్నారు. ఇది సైబర్ క్రైమ్ ఎలా అవుతుందో సజ్జల రామకృష్ణారెడ్డి నిరూపించాలని, దీనిపై ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమని సజ్జలకు సవాల్ విసిరారు. కనీస జ్ఞానం లేని సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఎలా రాణిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, రూరల్ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు, పట్టణ అధ్యక్షులు డి ఆర్ ఎల్ మణి, మైనారిటీ నాయకులు అబూబకర్, టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు రేవూరి వేణుగోపాల్, దళిత నాయకులు జడ శివ, జ్యోతి శివ, ప్రభు దాస్, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

➡️