భానుడి భగభగలు

Apr 27,2024 21:43

సాలూరులో 45.2డిగ్రీలు నమోదు

అల్లాడిపోతున్నజనం

ఉక్కపోతత ఉక్కిరిబిక్కిరి

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో గత నెల రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ నిప్పులు కురిపించడంతో జిల్లా అగ్నిగుండంగా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు వేడి వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు వేసవితాపాన్ని భరించలేక విలవిలలాడారు. ఉదయం 8 గంటల నుంచి గడప నుంచి బయట దాటడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు నిప్పులు కొలిమిలా మారిన వాతావరణాన్ని తట్టుకోలేక కొన్నిచోట్ల డీహైడ్రేషన్‌కు లోనయ్యారు. భానుడి తాపానికి జిల్లా ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలను చూస్తే అర్ధమౌతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి, కొమరాడ, సీతంపేట, సీతానగరం మండలాల్లో 44 డిగ్రీలు, సాలూరులో 45.2 డిగ్రీలకు చేరుకున్నాయి. బలిజిపేటలో 43.7, భామినిలో 43.7, మక్కువలో 43. 5, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో 43.8, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 42.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం వేడెక్కడంతో ఉపాధిహామీ కూలీల పనులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ, విపత్తు ల నివారణ శాఖకు చెందిన అధికారులు హెచ్చరిస్తున్నందున ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతల వలన డిహైడ్రేషన్‌ పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉదయం 10గంటల తర్వాత బయటకు రాకుండా, వచ్చినా నూలు దుస్తులు ధరించడం, శీతలపానీయాలు సేవించాలి.కురుపాం : మన్యం వ్యాప్తంగా శనివారం భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలాడిపోయారు. మన్యంలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు తాకింది. పలు గిరిజన గ్రామాల్లో 45 డిగ్రీల పైబడి ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వేశాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎండ తీవ్రతతో పాటు తీవ్ర ఉక్కపోతకు గాలి ఆడక జనం అల్లాడిపోయారు. పగటిపూట జనం బయటకు రాలేక పోయారు. సాయంకాలం 5 గంటల తర్వాత ఎండ వేడి తగ్గటంతో కొంత ఉపశమనం పొందారు. ఏప్రిల్‌ నెలాఖరులోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం భయాందోళనకు గురౌతున్నారు.

➡️