సామాజిక న్యాయానికి బిజెపి తూట్లు

May 4,2024 21:48

 వంత పాడుతున్న టిడిపి,వైసిపి

వామపక్షాలు, ఇండియా వేదిక గెలుపుతోనే న్యాయం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గడిచిన పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందని, దానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి వంత పాడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వామపక్షాలు, ఇండియా వేదిక గెలుపుతోనే న్యాయం జరుగుతుందని అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా కొమరాడ మండలంలోని కొమరాడ, కూనేరు గ్రామాల్లోనూ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండల కేంద్రాల్లోను శనివారం జరిగిన సిపిఎం ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కూనేరు సంత, తదితర గ్రామాల్లో సిపిఎం నాయకులకు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సామజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. అందులో భాగంగానే 5వ షెడ్యూల్‌, పీసా, 1/70 చట్టాన్ని ఉల్లంఘించి అడవులు, కొండకోనలను దోచుకోవడానికి, కార్పొరేషన్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్లు ఎత్తి వేస్తున్న బిజెపి తరువాత అందరి హక్కులనూ దెబ్బతీస్తుందన్నారు. వీటన్నిటికీ సిపిఎం, ఇండియా వేదిక అడ్డుకట్ట వేస్తోందన్నారు. అవినీతిలో కూరుకుపోయి బెయిల్‌పై బయటకు వచ్చిన టిడిపి, వైసిపి, బిజెపిలను ఓడించాలన్నారు. సిపిఎం, వామపక్ష నాయకులు ప్రజాసమస్యలపై పోరాడినందుకు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందన్నారు. మత ఘర్షణలతో దేశంలో అధికారం చలాయించేందుకు ప్రయత్నిసున్నారని అన్నారు. అదాని కోసం రాజమండ్రి నుంచి అరకు వరకు రూ.10 వేలకోట్లుతో రోడ్డు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 9 పంచాయతీల్లో సుమారు 45 గిరిజన గ్రామాలకు 70కిలో మీటర్ల దూరం తగ్గించే పూర్ణ పాడు – లాబేసు వంతెనను మాత్రం పూర్తి చేయడం లేదని అన్నారు. గతంలో సిపిఎం చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా రూ.14కోట్లతో ఈ వంతెన నిర్మాణాన్ని తలపెట్టారని అన్నారు. నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు, గిరిజన సంపద క్రయవిక్రయాలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యకం చేశారు. వంతెన పూర్తికి స్థానిక ఎమ్మెల్యే సహకరించకపోవడం సిగ్గు చేటని అన్నారు. పని చేసే కాంట్రాక్టర్‌ను డబ్బులు డిమాండ్‌ చేసిన పుష్ప శ్రీవాణిని ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. నియోజక వర్గంలో తగిన రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయ లేదన్నారు. ఉన్న పాఠశాలలను కూడా ఎత్తి వేస్తుండడంతో మన్యం జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి పోయిందన్నారు. మన్యంలో జీడి, అరకు లోయలో పండే కాఫీ సహా ఆనేక గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులకు బిజెపి గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. అటవీ సంరక్షణ చట్టం పేరిట పోడు పట్టాలను వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు ఇక్కడ బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసిపి కురుపాం ఎంఎల్‌ఎ అభ్యర్థి ఏ తెగలకు చెందిన వారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని అన్నారు. వారు నఖిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో పోటీచేసి గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు.. అటువంటి బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ కూడాద టిడిపికి రాజీనామా చేసి, సిపిఎం ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను బలపర్చాలని కోరారని తెలిపారు.

ఎన్నికల్లో కేవలం ఓట్లకోసం డబ్బులు పంచిన వారిని కాకుండా నిజాయతీగా ప్రజలకోసం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. వారితోపాటు ఇండియా వేదిక లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ బిజెపి, టిడిపి వైసిపి ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడకుండా మాట గారడితో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు పావులు కడుపుతున్నాయని అన్నారు. అందుకే సమస్యలపై చిత్త శుద్ది తో పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిపిఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, కురుపాం సిపిఎం ఎంఎల్‌ఎ అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడారు. అనంతరం అర్ధంతరంగా నిలిచిపోయిన పూర్ణపాడు – లాబేసు వంతెనను నాయకులు పరిశీలించారు.
➡️