గ్రామ్లాలో రాజకీయ చిచ్చు పెడుతున్న బొల్లా : జీవీ

May 10,2024 00:46

ప్రజాశక్తి-ఈపూరు:పచ్చటి గ్రామాల్లో రాజకీయ చిచ్చు పెడుతూ గొడవలను ప్రోత్సహిస్తున్న బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఎన్‌డిఎ కూటమి తరుపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. మండలంలోని ఎ.ముప్పాళ్లలో టిడిపి నాయకులు, మాజీ సర్పంచి మోదుగుల నరసింహారావు కారును దగ్ధం చేయటంతో గ్రామాన్ని జీవీ ఆంజనేయులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్వంశాలు, అరాచకాలు సృష్టించి అధికారం చేపట్టాలని వైసిపి చూస్తోందని అన్నారు. ఈ గ్రామం మహాత్మా గాంధీ నడవాడిన గ్రామమని, ప్రశాంతంగా ఉండే గ్రామంలో రాజకీయ గొడవలు ప్రేరేపిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామం వైసిపి పాలనలో గంజాయి హబ్‌గా మారిందని, బొల్లా అనుచరులు సొసైటీని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, కారు తగలబెట్టిన దుండగులను వెంటనే గుర్తించి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.జగ్గారావు, బాలయ్య, కె.చంద్రరావు, ఐ.హనుమయ్య, పి.వెంకటరావు, జి.శ్రీనివాసరావు, బి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️