ఇండియా వేదిక అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణుల ప్రచారం

May 2,2024 23:03

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడే తనను గెలిపించాలని ఇండియా వేదిక బలపర్చిన చిలకలూరిపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రాధాకృష్ణ ఓటర్లను కోరారు. స్థానిక చాకలి కాలనీ 9వ వార్డులో కాంగ్రెస్‌ సిపిఎం శ్రేణులు గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టాయి. ఇంటింటికీ వెళ్లి, అందర్నీ పలకరిస్తూ, కరపత్రాలు అందిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ అభ్యర్థి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.8333 చొప్పున ఐదేళ్లలో రూ.5 లక్షలు ఇస్తుందని చెప్పారు. కుల గణన చేపట్టి దాని ఆధారంగా సామాజిక, ఆర్థిక న్యాయం చేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌ కేటాయిస్తుందని చెప్పారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా, ఇతర స్కీమ్‌ వర్కర్లకు కేంద్రం వాటాగా ఇప్పుడిస్తున్న దానికి రెట్టింపు జీతం ఇస్తుందని, వారి హక్కులను పరిరక్షిస్తుందని తెలిపారు. ఉద్యోగినులకు హాస్టల్‌ సదుపాయాలు రెట్టింపు చేస్తుందన్నారు. పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర కల్పిస్తామని, రూ.2 లక్షల రైతు రుణమామాఫీ అమలు చేస్తామని, ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరు ద్ధరిస్తామని తెలిపారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ చట్టానికి చేస్తామన్నారు. ఉపాధి హామీ చట్టం కింద రోజుకూలి రూ.400 చేస్తామని, పట్టణ ప్రాంతాలకూ ఈ చట్టాన్ని విస్తరింపజేస్తామని హామీనిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు బీమా సదుపాయం, వికలాంగులకు రూ.6 వేల పింఛను, వృద్ధులకు రూ.4 వేల పింఛను ఇస్తామన్నారు. కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎస్‌.లూథర్‌, ఇ.ప్రభాకర్‌రెడ్డి, బి.కోటానాయక్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️