గుంటూరులో ఐటి టవర్లు నిర్మిస్తాం : చంద్రబాబు

May 1,2024 23:56

రోడ్‌ షోలో అభివాదం చేస్తున్న చంద్రబాబు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరులో ఐటి టవర్లు నిర్మించి ఇళ్ల వద్దే ఉద్యోగులు పనిచేసేలా కృషి చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి గుంటూరులో భారీ ప్రదర్శన జరిగింది. ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్‌, గళ్లా మాధవి, నశీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగంలో చంద్రబాబు నాయుడు టాప్‌లెస్‌ వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. చరద్రబాబు వాహనానికి ఒకవైపు పెమ్మసాని చంద్రశేఖర్‌, మరోవైపు గళ్లా మాధవి నిలబడి ర్యాలీని పర్యవేక్షించారు. తరువాత మార్గమధ్యలో నశీర్‌ అహ్మద్‌ వాహనం మీదకు వచ్చారు. నిర్ణీత సమయం కంటే రెండు గంటల ఆలస్యంగా గుంటూరు వచ్చిన చంద్రబాబు నాయుడు స్థానిక ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అడవితక్కెళ్లపాడు, జెకెసి కళాశాల రోడ్డు, గుజ్జనగుండ్ల సెంటర్‌, విద్యానగర్‌, చంద్రమౌళినగర్‌, కొరిటపాడు, లాడ్జి సెంటర్‌, శంకర్‌ విలాస్‌, హిందూ కళాశాల కూడలి, మార్కెట్‌ సెంటర్‌ మీదుగా స్థభాస్థలి హిమనీ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, తాను ప్రారంభించిన యుజిడి పనులు వైసిపి ప్రభుత్వం పక్కనపెట్టిందని అన్నారు. 2019లో టిడిపి గెలిచి ఉంటే అమరావతి పూర్తయ్యేదని తెలిపారు. వైసిపి గెలవడంతో రాజధాని నిర్వీర్యమైందన్నారు. వైఎస్‌ జగన్‌ బిజెపితో అంతర్గత పొత్తులో ఉన్నారని, తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం కొత్తగా బిజెపితో పొత్తుపెట్టుకున్నానని తెలిపారు. 2014 నుంచి 2018 వరకు బిజెపితో పొత్తులో ఉన్నా ఒక్క మైనార్టీకి కూడా ఇబ్బంది కలిగించలేదన్నారు. టిడిపి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 50 ఏళ్లుదాటితే పింఛన్లు వస్తాయన్నారు. ముస్తాఫాపై ధ్వజంగుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా గుట్కా, సిగరెట్ల వ్యాపారంలో మునిగి తేలుతూ అభివృద్ధిని మరిచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సిగరెట్ల ముసుగులో గుంటూరులో గంజాయి వ్యాపారం సాగుతుందన్నారు. గుంటూరులో వైసిపి అభ్యర్థులు డబ్బును వెదజల్లుతున్నారని తెలిపారు. గల్లా మాధవికి కితాబుచంద్రబాబు పాల్గొన్న ర్యాలీలో గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి చురుగ్గా పాల్గొన్నారు. ఒక చేత్తో వాహనాన్ని పట్టుకుని మరోవైపు ర్యాలీని క్రమబద్దీకరిస్తున్న ఆమెను చంద్రబాబు మెచ్చుకున్నారు. గుంటూరు పశ్చిమకు సరైన అభ్యర్థివి దొరికావమ్మ.. రౌడీలు అధికంగా ఉండే ప్రాంతంలో పురుషులతో సమానంగా దైర్యంగా వ్యవహరించావు.. అని కితాబిచ్చారు.వైసిపి నేతల చేరిక టిడిపి లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గుంటూరు డిప్యూటీ మేయర్‌ సజీల, ఆమె తండ్రి షౌకత్‌, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, గుంటూరు మిర్చి యార్డు వైస్‌ చైర్మన్‌ షేక్‌ మాబూ సుభానీ, కాంగ్రెస్‌ నాయకులు సవరం రోహిత్‌, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 41 వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుశ్మిత పద్మజ, ఎంపిటిసి నాగరాజు, మాజీ సర్పంచ్‌ అచ్చిరెడ్డి, డి.శివబాబు తదితరులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.

➡️