సత్ప్రవర్తనతోనే ఖైదీల్లో మార్పు

May 21,2024 20:58

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌:  జైలులో ఉండే ఖైదీలకు సత్ప్రవర్తనతోనే మార్పు రావాలని జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. సోమవారం సబ్‌ జైలును జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ వారికీ సరైన ఆరోగ్య తనిఖీలు చేస్తున్నారో లేదోనని ఆరా తీశారు. మంచి భోజనం, వసతి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కాలం జైల్లో ఎంత మంది ఖైదీలు ఉన్నారు. అలాంటి వారికి ఇప్పటి వరకూ ఎందుకు బెయిల్‌ రాలేదని జైలు వార్డెన్‌ మోహన్‌ బాబును అడిగారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేయని ఖైదీలు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొన్నిసార్లు క్షణికావేశంలో చేసిన తప్పుకు జైలు జీవితం గడపాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. మీరు జైలులో ఉంటే బయట ఉండే నీ కుటుంబం పరిస్థితి గురించి ఆలోచించారా, అనాలోచిత నిర్ణయాలు మంచివి కాదని బైటకు వచ్చిన తరువాతైనా కుటుంబం కోసం సన్మార్గంలో నడవాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి జైలు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి విజయ కల్యాణి పాల్గొన్నారు.

➡️