‘కోట’పై కోళ్లది చెరగని ముద్ర

Apr 24,2024 21:38

ప్రజాశక్తి-శృంగవరపుకోట : విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం పేరు చెప్పగానే, టక్కున గుర్తొచ్చేది కోళ్ల కుటుంబం. నాలుగు దశాబ్దాలపాటు శృంగవరపుకోటలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది కోళ్ల ఫ్యామిలీ. 2009లో నియోజకవర్గ పునర్విభజనకు ముందు, ఉత్తరాపల్లి నియోజకవర్గంగా ఉండేది. 1983లో టిడిపి ఆవిర్భావంలో ఉత్తరాపల్లి నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు కీర్తిశేషులు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు. వరుసగా ఐదుసార్లు (1983, 1985, 1989, 1994, 1999) గెలిచి సత్తాచాటారు. 1985, 89లో ఎన్‌టిఆర్‌ మంత్రి వర్గంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రిగా కొనసాగారు. 1999లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 పునర్విభజన తర్వాత ఉత్తరాపల్లి నియోజకవర్గం పోయి, శృంగవరపుకోటగా ఆవిర్భవించింది. దీంతో కోళ్ల అప్పలనాయుడు వారసురాలిగా రాజకీయ రంగప్రవేశం చేశారు మనవరాలు కోళ్ల లలిత కుమారి. వరసగా రెండుసార్లు ఎస్‌.కోట నుంచి గెలిచారు. కోళ్ల అప్పలనాయుడు మొత్తం ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరావల్లి నుంచి ఐదుసార్లు టిడిపి నుంచి గెలుపొందిన ఆయన.. రేవిడి, ఎస్‌.కోట నుంచి చెరోసారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1985, 89లో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో కొంతకాలం దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనతో గిరిజన నియోజకవర్గంగా ఉన్న శృంగవరపుకోట జనరల్‌గా మారింది. దీంతో కోళ్ల అప్పలనాయుడు మనువరాలు, కోడలు అయినటువంటి కోళ్ల లలితకుమారి శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి శాసనసభకు టిడిపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి గెలుపొందారు. టిడిపి విజయనగరం జిల్లా అధ్యక్షురాలుగా, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి మరోసారి పోటీచేసిన ఆమె పరాజయం పాలయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టిడిపి అభ్యర్థిగా లలితకుమారి బరిలో దిగారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావుకు టికెట్‌ ఖరారు చేయడంతో ఇద్దరి మధ్య పోటీ జరగనుంది.టిడిపితో సుదీర్ఘ అనుబంధం కోళ్ల లలితకుమారి కుటుంబానికి టిడిపితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ కుటుంబం 1962 నుంచి శాసనసభకు పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. 1962 రేవిడి నియోజకవర్గం నుంచి, 1967 శృంగవరకోట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కోళ్ల అప్పలనాయుడు శాసనసభలో అడుగెట్టారు. 1983 నుంచి 1999 వరకు టిడిపి తరపున వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి అప్పలనాయుడు మనువరాలు లలితకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాలుగా కోళ్ల కుటుంబం టిడిపి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది.

➡️