కదం తొక్కుతు..పథం పాడుతూ.

కదం తొక్కుతు..పథం పాడుతూ.

కదం తొక్కుతు..పథం పాడుతూ..ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:కొత్త సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ అంగన్వాడీలు కదం తొక్కుతు..పథం పాడుతూ ఆదివారం స్థానిక గాంధీ విగ్రహం ఎదట ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె అంగన్వాడీల చేస్తున్న సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపట్ల స్పందించకపోవడంతో గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వ తీరును నిరశిస్తూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పదించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సృజని, ప్రభావతిలు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతో అనేకసార్లు యూనియన్‌ నేతలు చర్చలు జరిపినా జీతాలు పెంపు, గ్రాట్యూటీ అమలు వంటి విషయాలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మెను కొనసాగించాల్సి వస్తోందన్నారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలు నూతన సంవత్సర వేడుకులు దీక్షా శిబిరాల్లోనే నిర్వహించుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామన్నారు. ఈనెల 3వ తేదీన పెద్ద ఎత్తన కలెక్టరేట్‌ ముట్టడికి పూనుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు రమాదేవి, మణి, చిత్తూరు, గుడిపాల మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. కార్వేటినగరం: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరింది. ఆదివారం కార్వేటినగరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆట పాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నదని ప్రశ్నించారు. ఈరోజు నుంచి సమ్మె ఉధతరూపం దాల్చుతుందని గతంలోనే హెచ్చరించినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జగమొండి లాగా వ్యవహరిస్తుంటే అంతకంటే రెట్టింపు స్థాయిలో అంగన్వాడీలు పోరాటం చేయడంతో వారి పోరాటానికి రోజురోజు మద్దతు పెరుగుతున్నదని, చర్చలు పేరుతో దాటవేస్తూ వస్తే ప్రజా ఉద్యమంగా దాల్చుతుందని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 3న కలెక్టరేట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ సిఐటియు ప్రాజెక్ట్‌ నాయకులు మమత, యువరాణి, హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు రాధా పాల్గొన్నారు.పలమనేరు: మండలంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 20 రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఆటపాటతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు గిరిధర్‌ గుప్తా అధ్యక్షతన వహించారు. అంగన్వాడీలు, సిఐటియు నాయకులు భారతి, ఏయుటిఎస్‌ శాంతి, ఐఎఫ్‌టియు లక్ష్మీ, చిలకమ్మ పాల్గొన్నారు.బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తమ డిమాండ్‌ పరిష్కరించాలని 20 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీలు ఆటపాటల, గొబియాలు తడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ నాయకురాలు శకుంతలమ్మ పాల్గొన్నారు.

➡️