జగన్‌ని ఇంటికి పంపుతాం..

Dec 20,2023 22:20

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
సమస్య పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగిపోవడం కాయమని అంగన్వాడీ యూనియన్ల నాయకులు సుజని, బుజ్జి, ప్రభావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం స్థానిక చిత్తూరు సిడిపివో కార్యాలయం ఎదటు ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సామరస్యంగా చర్చించి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయకపోగా అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులతో బెదిరించడం ప్రభుత్వానికి తగదన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయమైన సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చి అంగన్వాడీ వర్కర్ల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఎన్నికలు సమీపించే రోజులు దగ్గర పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుటీతో పాటు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్‌గా గుర్తించాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లను రద్దు చేయాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరును నిరశిస్తూ భిక్షాటన చేశారు. కార్యక్రమంలో చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు అర్బన్‌, రూరల్‌, గుడిపాల మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. భిక్షాటన చేస్తూ.. కార్వేటినగరం: ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లు, హెల్పర్స్‌ వేతనాలు పెంచాలని చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజు కొనసాగింది. అంగన్వాడీలు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీల యూనియన్‌ నాయకులు మమతా, రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పురవీధులలో భిక్షాటన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాణి, నాగమ్మ, యువరాణి, కార్వేటినగరం, వెదురుకుప్పం, శ్రీరంగ రాజపురం మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. వంటావార్పుతో.. పుంగనూరు: అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై చేస్తున్న సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతూ బుధవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 9వ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. అంగన్వాడీలు నాయకులు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. కార్యక్రమంలో రత్నమ్మ, సునంద, కే.విజయ కుమారి, ఈవి.రమణమ్మ, పుణ్యవతి పాల్గొన్నారు.

➡️