దారిపొడవునా కుదుపు.. వాహనానికి తప్పదు అదుపు.!

Dec 17,2023 23:17
దారిపొడవునా కుదుపు.. వాహనానికి తప్పదు అదుపు.!

ప్రజాశక్తి-యాదమరి: చిత్తూరు-గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా తయారైంది. యాదమరి మండలం జోగుడిచింతల పోలీస్‌స్టేషన్‌ నుండి తమిళనాడు సరిహద్దు కనికాపురం చెక్‌ పోస్ట్‌ వరకు ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ఈ రహదారి గుండా ప్రయాణికులు ప్రయాణించాలంటే నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తారు రోడ్డు పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు కరువవడంతో రహదారులు లోతైన గుంతలు ఏర్పడ్డాయి. పది రోజుల క్రితం రోడ్ల భవనాల శాఖ ఏఈ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతుల పేరుతో రోడ్డులోని గుంతలకు మట్టి వేయడంతో బురదమయంగా మారిపోయింది. ఈ బురదలో వాహనాలు కూరుకు పోతున్నాయి. దీంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న అవి బుట్టదాకలవుతున్నాయి. సమస్యను అధికారులకు ఏకరువు పెట్టినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయిందని స్థానికుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. జోడి చింతల నుండి కనికాపురం వరకు చిత్తూరు-గుడియాత్తం జాతీయ రహదారి 9 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ మార్గంలో అడుగడుగునా భారీ గుంతలే దర్శనమిస్తున్నాయి. వాహనదారులు వాటిని తప్పించి ప్రయాణం సాగించడం దుర్లభంగా మారుతుంది. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలను బారిన పడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది గాయాలు పాలై మతి చెందిన సంఘటన కూడా ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

➡️