పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎంసీసీ ఫిర్యాదులపై తక్షణం చర్యలు: ఏఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ

Apr 1,2024 22:10
పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎంసీసీ ఫిర్యాదులపై తక్షణం చర్యలు: ఏఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని 150 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏఆర్వో కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఆర్వో ఆదేశాల మేరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంప్‌ సౌకర్యాలు కల్పించామని, విద్యుదీకరణ, మరుగుదొడ్లు, నీటి సరఫరా, ఫర్నిచర్‌ వంటి సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సదరు పోలింగ్‌ కేంద్రం సంబంధించి పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ వారి ఫోన్‌ నెంబర్లు రాయించినట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శుభ్రత పనులు చేపట్టినట్లు వివరించారు. నగరపాలక పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నట్లు ఏఆర్వో, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ వివరించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల భవనాలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రధాన కూడళ్లలో, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయపరమైన బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు, గోడలకు ఏర్పాటు చేసిన స్టిక్కర్లను తొలగించామన్నారు. ఎంసీసీ అమలుకు సంబంధించి అందిన ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకుంటున్నామని, సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటివరకు అందిన 26 ఫిర్యాదులను ఎంసీసీ బందాలు పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరంలో ఎంసీసీ, ఎఫ్‌ఎస్టీ, వీఎస్టీ బందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నగర ప్రజల సైతం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అవగాహన పెంచుకొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీసీ అధికారులు గోపి, గోపాలకష్ణ వర్మ పాల్గొన్నారు.

➡️