శివోహం..

Mar 8,2024 22:35
శివోహం..

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: శివనామస్మరణతో మొగిలీశ్వరాలయం మార్మోగింది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మొగిలి స్వయంభుగా వెలసియుండు శ్రీ కామాక్షి సమేత మొగిలి స్వరాలయంలో ఉదయం నుండి శివ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి మునిరాజులు పూజా కార్యక్రమాలు, భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో బందోస్తు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయాన్నే స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా జీకేసీ కళ్యాణమండపం యాజమాన్యం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. గంగాధరనెల్లూరు: శివరాత్రి సందర్భంగా మండలంలోని పలు శివాలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. ఎస్‌.ఎస్‌. కొండ సిద్దేశ్వరస్వామి ఆలయంలో లింగోద్భవం, కొట్ర కోనలో శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో, గంగాధర నెల్లూరులో గంగాధరేశ్వర స్వామి ఆలయంలో, మహాదేవ మంగళంలోని మహదేవుని ఆలయంలో, వెజ్జుపల్లెలో ఆవుదేవర నందీశ్వర స్వామి దేవాలయంలో, వేల్కూర్‌లోని శివాలయంలోనూ ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకంతో పాటు అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సందర్శించుకున్నారు. జాగరణ చేసే భక్తుల కోసం శుక్రవారం రాత్రి హరికథ కాలక్షేపం, కోలాటాలు, చెక్కభజనలతో భక్తులను అలరించారు. సోమల: శివరాత్రి సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని శివాలయాలలో భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగాయి. సోమల ఇరికిపెంట కందూరు నంజంపేట మల్లేశ్వరపురం దుర్గంకొండ ప్రాంతాలలోని శివాలయాలలో ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే శివాలయాలకు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులను తీర్చుకున్నారు. ప్రతి శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం శివకోటి భజనలు ప్రత్యేక కార్యక్రమాలతో జాగరణ కార్యక్రమాలను నిర్వహించారు. సదుం: మండలంలోని శివాలయాల్లో శుక్రవారం ఘనంగా మహా శివరాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ఊటుపల్లి గ్రామం పరిధిలోని దేవళం బోడు నందు వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అరవ వాసునాధ రెడ్డి శుక్రవారం తెలిపారు. సదుం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలోని శివాలయంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ నాలి కష్ణారెడ్డి తెలిపారు. సదుం దిగువ జాండ్రపేటలోని అరుణాచళం దేవస్థానం, అమ్మగారిపల్లి సీతమ్మ గుట్ట పైన వెలిసిన శివాలయంలో, నడిగడ్డ మతుకువారిపల్లిలోని మల్లేశ్వరస్వామి గుడి, యర్రాతివారిపల్లిలోని శ్రీ కన్నెమూల దేవస్థానం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యానోత్సవం, బూరగమంద పంచాయతీ పరిధిలోని శివకోనలో అత్యంత భక్తి శ్రద్దలతో శుక్రవారం రాత్రి మహా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. చిత్తూరుడెస్క్‌: నగరి మండలంలోని తడుకుపేట గ్రామంలోని సత్యసాయి ఆలయంలోని సాయిలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. మహాశివ రాత్రిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి భజన మండలిలో ఓంకారం, నగర సంకీర్తన, గోపూజ, సాయి లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్‌ విద్యార్థులచే తల్లి తండ్రులకు పాద పూజ నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్‌ పరిధి కీళపట్టు చంద్రమౌళీశ్వర ఆలయంలో విన్నూత్నంగా తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మించిన ఏకపాదమూర్తిని, అఘోరీల మధ్య తపస్సు చేసే మహాశివుని శుక్రవారం మంత్రి రోజా దర్శించుకున్నారు.పట్టువస్త్రాలు సమర్పణప్రజాశక్తి-వెదురుకుప్పం: కొండమల్లీశ్వరస్వామికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయన కుమార్తై కృపాలక్ష్మి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని మాంబేడు పంచాయితీ, దుద్దే రామానాయుడు కండిగ సమీపంలో వెలసిన కొండ మల్లేశ్వరస్వామి వారికి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన నారాయణస్వామి, కృపాలక్ష్మికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి జాగరణకు సాంస్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

➡️