వి కోటలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి

Apr 5,2024 16:36 #Chittoor District

ప్రజాశక్తి-వి కోట : స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో యావత్ భారతదేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉపరాష్ట్రపతి అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం ఎమ్మార్పీఎస్, బాస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కూడలిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక రుగ్మతులపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతుడు బాబూజీ అని అన్నారు. భారత రాజకీయ చరిత్రలో ఆయనకున్న ప్రతిష్ఠ వేరొకరికి లేకపోవడం దళిత వర్గాలకు గర్వంగా ఉందన్నారు. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రం చాంద్వా గ్రామంలో పుట్టి 1936 లో 27 ఏళ్ళకే అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 50 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ప్రపంచ రికార్డు సాధించారని కొనియాడారు. తంతి, తపాలా శాఖ మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా కార్మికుల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడ్డారన్నారు. కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశారన్నారు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి చట్టాల ద్వారా సామాజిక భద్రత అంశాలకి పునాది వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి జనతా పార్టీలో చేరి 1977 నుండి 1979 వరకు మొదటి దళిత ఉప ప్రధానిగా పనిచేసి పదవులకు వన్నే తెచ్చారని గుర్తుచేశారు. ఈ దేశంలో బాబూజీ అని ప్రజల చేత పిలిపించుకున్న రెండో వ్యక్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, శంకర్రావు, బాస్ నాయకులు గణపతి, దొరస్వామి, వినోద్, నారాయణ, శివరాం, సంపంగి, జయప్ప, దాము, మురళి, భరత్, తదితరులు పాల్గొన్నారు.

➡️