గ్రంధాలయం దయనీయం.

గ్రంధాలయం దయనీయం.

గ్రంధాలయం దయనీయం..ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సోమలలోని గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన వేసవి శిక్షణాశిబిరం నిర్వహించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవి సెలవులలో పిల్లలు సెల్‌ఫోన్లకు పరిమితం కాకుండా పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచేందుకు విద్యార్థులను గ్రంథాలయాల వైపు మళ్లించడానికి ప్రతిఏటా గ్రంథాలయాలలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్న వయసు నుండే పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించడం ద్వారా బాలల్లో వ్యక్తిత్వ వికాసం మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతాయి. ఈ ఉద్దేశంతో జిల్లాలోని అనేక గ్రంథాలయాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణాశిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనెల 15వ తేదీ నుండి జూన్‌ 7వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యార్థులకు సరదా కల్పిస్తూనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే శిబిరాలను అందజేస్తున్నారు. కథలు చెప్పడం వినడం పుస్తక పఠనం చిత్రలేఖనం సజనాత్మక కార్యక్రమాలు యోగ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే మండల కేంద్రమైన సోమలలోని గ్రంథాలయంలో గత ఏడాది వేసవి శిక్షణాశిబిరం జరిగిన తరువాత ఈ ఏడాది గ్రంథాలయంలో పనిచేసే గ్రంథాలయ అధికారి పదవీ విరమణ చేయడంతో కలికిరి గ్రంథాలయ అధికారి విజరుకుమార్‌ను ఇన్చార్జి గ్రంథాలయ అధికారిగా నియమించారు. అటు కలికిరి మెయిన్‌ బ్రాంచ్‌లోను సోమల బ్రాంచ్‌ లోను విధులు నిర్వర్తించాల్సి రావడంతో ప్రతిరోజు గ్రంథాలయ తలుపులు తెరుచుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిపై ఇన్చార్జి లైబ్రేరియన్‌ విజరు కుమార్‌ను చరవాణి ద్వారా వివరణ కోరగా ఇన్చార్జి బ్రాంచ్‌లలో వేసవి శిక్షణ శిబిరాలు ఎక్కడా నిర్వహించలేదని సిబ్బంది కొరత కారణంగా మెయిన్‌ బ్రాంచ్‌లలో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమల శాఖ గ్రంధాలయానికి గ్రంథాలయ అధికారిని నియమించి ఇక్కడ విద్యార్థులకు యువకులకు గ్రంధాలయాల వల్ల కలిగే లాభాలను అందించే అవకాశం కల్పించాలని గ్రామస్తులు విద్యార్థులు యువకులు కోరుతున్నారు.

➡️