16న గ్రామీణ బంద్‌

Feb 13,2024 22:11
16న గ్రామీణ బంద్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఈనెల 16వ తేదీ జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని మంగళవారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్మిక, కర్షక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చాంది. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పి.చైతన్య అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచివరం సురేంద్రన్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నెరెత్తినట్టు ఉండడం దారుణమన్నారు. రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు మద్దతు ధరలు చట్టం చేయాలన్నారు. నాలుగు లేబర్‌ కోర్టులను రద్దు చేయాలన్నారు. ఈనెల 16న జరుగుతున్న గ్రామీణబంద్‌ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. భూహక్కుల చట్టం 27/23ను ఉపసంహరించాలని అన్నారు. సమగ్ర పంటల భీమా పథకాన్ని పెట్టాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి హెచ్‌.ఓబుల్‌రాజు మాట్లాడుతూ ఉపాధి హామీకి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. అలాగే ఆన్లైన్‌ మస్టర్‌ రద్దు చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం సవరణలను ఉపసంహరించాలన్నారు. ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్‌. నాగరాజన్‌, దాసరి చంద్ర మాట్లాడుతూ పరిపాలన చేసేవారు నిజాయితీగా చేయాలని నిరంకుశత్వానికి పాల్పడితే ప్రజలే పాలకులకు బుద్ధి చెబుతారని విమర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య, ఉపాధ్యక్షులు వాడ గంగరాజులు మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల మెడపై పెట్టిన కత్తి హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన జరుగుతున్న గ్రామీణ బంద్‌ను ట్రాన్స్పోర్ట్‌ సమ్మెను పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతిరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బిల్డింగ్‌ వర్కర్స్‌ డబ్బులను తిరిగి ఇవ్వాలని, బిల్డింగ్‌ కార్మికుల సమస్యలను నిజాయితీగా పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో లోకయ్య, రమాదేవి, ఆటో యూనియన్‌ నాయకులు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

➡️