ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే

Apr 11,2024 13:48 #Chittoor District
  • జయంతి వేడుకల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

ప్రజాశక్తి-చిత్తూరు : 150 సంవత్సరాల క్రితం సనాతన పేరుతో ప్రజలను మోసగించడాన్ని సంస్కృతికరణ అని చాటి చెప్పిన గొప్ప మేధావి మహాత్మ జ్యోతిరావు పూలే. ఆయన జయంతి సందర్భంగా చిత్తూరులో సిపిఎం ఆధ్వర్యంలో విగ్రహానికి మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ దేశంలో ప్రజలను మోసగిస్తూ దోపిడీని కొనసాగించడానికి సృష్టించిందే సంస్కృతికరణ, సనాతన ధర్మం అని ఆయన ఆనాడే చాటి చెప్పారు. దాని నుంచి బయట పడాలంటే దేశంలోని మహిళలు చదువుకున్నప్పుడే మూఢాచారాల నుంచి బయటపడతారని వారి భార్యకి చదువు చెప్పించి ఉపాధ్యాయులగా తయారు చేసి మహిళలకు చదువు చెప్పిన గొప్ప మేధావి అన్నారు. ఆయన వేసిన అడుగు జాడల్లో భార్య సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా ఎదిగి మహిళలకు చదువు చెప్పించడంతో నేడు దేశంలో ఉన్న ప్రతి మహిళ చదువుకుని అన్ని రంగాల్లో ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. అలాంటి మేధావులను నేడు రాజకీయ నాయకులు విస్మరించడం బాధాకరమన్నారు. ఆయన కన్న కలలను నేడు దేశంలో పరిపాలనలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం నీరుగార్చుతూ చదువును మహిళలకు, పేదలకు దూరం చేస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నది. ఇలాంటి మతోన్మాద శక్తులను ఆట కట్టించడానికి మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని ఆయన తెలిపారు. సిపిఎం నిరంతరం జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తున్నదని ప్రజలందరూ సిపిఎం చేస్తున్న కార్యక్రమాలను బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కే సురేంద్రన్, నాయకులు రాజశేఖర్ వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️