సిఐటియు ఉద్యమాల్లో కూన కీలకపాత్ర

కూన సత్యనారాయణ, సిఐటియు

మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ

సత్యనారాయణ, పార్వతి దంపతులకు సత్కారం

ప్రజాశక్తి -మాధవధార : విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ ప్రయివేటుపరంగా కాకుండా, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మూడు దశాబ్ధాలుగా విశాఖ పోర్టులో నిర్వహిస్తున్న అనేక ఉద్యమాల్లో కూన సత్యనారాయణ కీలకపాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ అన్నారు. విశాఖ పోర్టు అథారిటీలో లస్కర్‌ గ్రేడ్‌-1గా విధులు నిర్వర్తించి, ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన కూన సత్యనారాయణ, పార్వతి దంపతులను ఆదివారం మాధవధారలోని మాధవస్వామి కల్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ, జివిఎంసిలో సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, మాట్లాడుతూ మాధవధారలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండే కూన సత్యనారాయణ ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేశాడని, విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌లో ఉద్యోగంలో చేరాక, కార్మికుల సమస్యలపై సిఐటియు సంఘంలో చేరి నిరంతరం పనిచేశారన్నారు. విధుల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, విశాఖపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారన్నారు. యునైటెడ్‌ పోర్ట్‌ అండ్‌ డాక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. పోర్టు యాజమాన్యం ఆయనను సస్పెండ్‌ చేసినా,వెనుకడుగు వేయకుండా కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడారని గుర్తు చేశారు. మాధవధార ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చినా సత్యనారాయణ తన శక్తి మేరకు వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. 50,51 వార్డుల్లో వార్వా అపార్ట్‌మెంట్ల సమస్యలపై ఉద్యమాలు చేశారన్నారు. ఈ రకంగా సత్యనారాయణ పనిచేయడానికి అతని భార్య పార్వతి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతగానో ఉందన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం తన ఆరోగ్యాన్ని చూసుకుంటూ,ప్రజా సమస్యల మీద పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.యునైటెడ్‌ పోర్ట్‌అండ్‌డాక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.ఎస్‌ పద్మనాభరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాధవధార స్నేహబంధం, బంధువులు, మిత్రులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, సిఐటియు నాయకులు బి జగన్‌, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, డాక్‌ లేబర్‌ బోర్డు కార్యదర్శి లక్ష్మణరావు, 50వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సనపల వరప్రసాద్‌, మాధవ యువజన సమాజం అధ్యక్షులు సనపల రామ్‌ గోపాలరావు, మాధవ యువజన సమాజం సహాయ కన్వీనర్‌ పప్పల రామచంద్రరావు, టిడిపి, సిపిఎం, వైసిపి నేతలు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

సిపిఎం నగర కమిటీకి రూ.లక్ష విరాళం

విశాఖపట్నం పోర్టు అథారిటీలో లస్కర్‌ గ్రేడ్‌ -1గా ఉద్యోగ విరమణ చేసిన కూన సత్యనారాయణ, పార్వతి దంపతులు సిపిఎం నగర కమిటీకి రూ.లక్ష విరాళాన్ని ఆదివారం ఇచ్చారు. ఈ మేరకు సిఐటియు నాయకులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, బి జగన్‌, బొట్టా ఈశ్వరమ్మలకు చెక్కును అందజేశారు.

కూన సత్యనారాయణ, సిఐటియు

➡️