రాజధాని నిర్మాణంలో స్థానిక కార్మికులకు అవకాశమివ్వాలి : సిఐటియు

Jul 1,2024 00:00

ప్రజాశక్తి – చేబ్రోలు : భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రమైన చేబ్రోలులోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సదస్సు ఎస్‌కె మస్తాన్‌వలి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. లకీëనారాయణ మాట్లాడుతూ జిల్లాలో కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రాజధాని నిర్మాణంలో స్థానిక కార్మికులకు అవకాశం కల్పించాలని, దానివల్ల రాజధాని నాది అనే భావన కార్మికుల్లో పెరుగుతుందని చెప్పారు. ఇసుక తక్షణమే అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి, కుటుంబాల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలకు కృషి చేయాలన్నారు. సంఘం మండల కార్యదర్శి చౌడయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. సదస్సులో నాయకులు నాగేశ్వరరావు, రఫాని, ఖాజా బాషా, నాగేశ్వరరావు, రాజు పాల్గొన్నారు.

➡️