ఏయూ వీసీ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి అక్రమాలపై న్యాయ విచారణ చేపడతాం : అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్‌

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ రిపోర్టర్) : ఏయూ వీసీ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి అక్రమాలపై న్యాయ విచారణ చేపడతామని అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్‌ అన్నారు. ఏయూ వీసీ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలపై … శనివారం బిజెపి టిడిపి జనసేన కూటమి సభ్యులు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్‌ కార్యాలయం ఎదుట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్‌ మాట్లాడుతూ …. రాజీనామా చేసినంతమాత్రాన ప్రసాద్‌ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. పవిత్రమైన విద్యాలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చారని, ఇక్కడి నుండే వైసిపి పార్టీ సర్వేల కు ఇతర కార్యక్రమాల కు డబ్బుల పంపకాలు జరిగాయని ఆరోపించారు. కార్యాలయానికి ఎవరినీ రానీయకుండా ఇనుప ఫెన్షింగ్‌ నిర్మించుకున్నారని అన్నారు. ఇక్కడ ప్రసాద్‌ రెడ్డి చేసిన ప్రతి పనికి లెక్క ఉందని ఆ లెక్కలన్నీ త్వరలోనే తేలుస్తామన్నారు. భారతదేశంలో పేరున్న యూనివర్శిటీలో ఆంధ్రా యునివర్సిటీ ఒకటని అలాంటి యునివర్సిటీ ప్రతిష్ట ప్రసాద్‌ రెడ్డి హయం లో తీవ్రం గా తెబ్బతిందని ధ్వజమెత్తారు. దాదాపు రూ.100 కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రసాద్‌ రెడ్డి పై వెంటనే న్యాయ విచారణ కు ఆదేశించాలని గవర్నర్‌ ను, అలాగే ప్రభుత్వాన్ని కోరారు. విచారణ అనంతరం అతడిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ … 2014 – 19 లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మార్పులు తీసుకువచ్చానని అన్నారు. గతంలో ఎలా ఉండేదో యూనివర్సిటీని మళ్ళీ అదే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గతంలో ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేస్తామని , ఏయూ యూనివర్శిటీ లో ఎలాంటి రాజకీయాలు లేకుండా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశం లో తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకఅష్ణ బాబు , దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశి కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, ఏయు పరిరక్షణ సమితి సభ్యులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

➡️