నేడు పల్నాడు జిల్లాకు సిఎం బస్సుయాత్ర

Apr 8,2024 00:31

యాత్ర మార్గాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్‌
ప్రజాశక్తి – వినుకొండ :
వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 11వ రోజైన సోమవారం వినుకొండ నియోజకవర్గం ద్వారా పల్నాడు జిల్లాలోకి ప్రవేశించనుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద నుండి సోమవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. కురిచేడు మీదగా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామం వద్ద బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోని ప్రవేశిస్తుంది. అయినవోలు నుండి చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం అనంతరం బస్సు యాత్ర సాయంత్రం 3:30 గంటలకు వినుకొండ పట్టణం చేరుకుంటుంది. విఠంరాజుపల్లి మీదగా శావల్యాపురం మండలం కనుమర్లపూడి, శావల్యాపురం, కృష్ణాపురం, గంటవారిపాలెం వద్దకు రాత్రికి చేరుకుంటుంది. రాత్రి గంటవారిపాలెం వద్ద బస చేస్తారు. మంగళవారం ఉదయం అదే గ్రామంలో ఉగాది వేడుకల్లో సిఎం పాల్గొంటారు. పంచాంగ శ్రవణం అనంతరం తెలుగు సంవత్సరాది కేలండర్‌ను ఆవిష్కరిస్తారు.సిఎం యాత్ర నేపథ్యంలో మార్గాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ ఆదివారం పరిశీలించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందితో సమావేశమై రూట్‌ మ్యాప్‌ను వివరించారు. బస్సు యాత్ర సాగే మార్గంలో గ్రామాలను, స్థానికులను, వివిఐపిలను కలిసే ప్రాంతాలను, ప్రదేశాలను పరిశీలించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు గురించి వివరించారు. రోడ్డు ఓపెనింగ్‌ పార్టీలు, బస్సు ముందు ఉండే అడ్వాన్స్‌ క్లియరెన్స్‌ బృందాలతో పాటు, రోప్‌పార్టీ బృందాలను, ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు వెంటనే స్పందించే క్విక్‌ రియాక్షన్‌ బృందాలను, అనుమానితులను పసిగట్టే నిఘా బృందాలను ఏర్పాటుకు మార్గదర్శకాలు ఇచ్చారు. సిఎం ప్రయాణించే బస్సుతో ఐనవోలు, చికటిగలపాలెం, వినుకొండ పట్టణం, విటంరాజుపల్లి, కనమర్లపూడి, శావల్యాపురం, కృష్ణపురం, గంటావారిపాలెం వరకు ట్రయల్‌ రన్‌ వేశారు.

➡️