6వ రోజుకి చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

Dec 25,2023 15:48 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర అభియాన్‌ ఉద్యోగులను మోసం చేశారని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఫెడరేషన్‌ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు బి కాంతారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 6వ రోజుకి చేరుకుందన్నారు. జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారన్నారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. యం.టీ.యస్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులైజేషన్‌, వేతనాల పెంపు, తక్షణమే బకాయిల చెల్లింపు తదితర సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె చేయాల్సి వస్తుందన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి గురువులు ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️