మండుటెండలో ఉపాధి కూలీల అవస్థలు

Apr 6,2024 21:31

ప్రజాశక్తి – కురుపాం : గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు వలసలు నివారించేందుకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం రూపొందించింది. ఇందులో భాగంగా పనిచేసే ప్రతి వ్యసాయ కార్మికుడికి ఉపాధిహామీ చట్టం జాబ్‌ కార్డులను అందజేశారు. జాబ్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు… పని పదేశాల్లో కూలీల కోసం కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వేసవిలో టెంట్లు ఏర్పాటు, మజ్జిగ, మంచినీళ్లు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాలని, ప్రథమ చికిత్స కిట్లును అందుబాటులో ఉంచాలని, వేసవి రోజుల్లో పని చేసే కూలీలకు అదనపు కూలి ఇవ్వాలి ఆ చట్టంలో పేర్కొంది. అయితే బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ చట్టంలో పలు సవరణలు తీసుకొచ్చింది. ఉద్దేశ పూర్వకంగా ఈ చట్టాన్ని నీరుగార్చేలా సరవణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు గరిష్టవేతనం అందడం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలతో పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్ల ఏర్పాటు, మజ్జిగ ఫ్యాకెట్ల పంపిణీ, తాగునీరు వంటి సౌకర్యాలు లేక సమీప బోరుల్లో నుంచి ఇంటిల్లో నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.ఏడు వారాలుగా వేతనాలు పెండింగ్‌ ప్రస్తుతం ఎటువంటి పనుల్లేకపోవడంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా ఉంది. తప్పని పరిస్థితుల్లో ఉపాధిహామీని నమ్ముకొన్న తరుణంలో ఈ పనులపైనే కూలీలు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం అంతగా కలిసి రాకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు సైతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. పని చేసిన ఒకటి, రెండు వారాల్లో కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. కూలీల వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి వారం మండల కార్యాలయా నికి పంపుతారు. వారుచేసిన పనిని బట్టి ప్రతి సోమవారం ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజులకు కూలీల ఖాతాల్లో నగదు జమవుతుంది. కానీ వివరాలు నమోదు చేసి 40 రోజులు దాటుతున్నా వేతనాలు చెల్లించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఇప్పటి వరకూ చేసిన పనులకు వేతనాలు మంజూరు కాలేదు. వాస్తవానికి మార్చి నెలకు మొత్తం వేతనం పడాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు పడలేదు.అరకొర వేతనాలు మండుటెండల్లో రెండు పూటలా పని చేస్తున్నా అరకొర వేతనాలే అందుతున్నాయని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు వారీ వేతనాన్ని ప్రభుత్వం స్వల్పంగా పెంచింది . కానీ పలు ప్రాంతాల్లో రూ.270 మించి రావడం లేదని పలువురు కూలీలు తెలిపారు. గతంలో వేసవిలో ఉపాధి పనులు చేసేవారికి ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం చొప్పున వేసవి అలవెన్స్‌లు అందజేసేవారు. మజ్జిగ కూడా సరఫరా చేసేవారు. 2022- 23 ఆర్థిక సంవత్సరం నుంచి వీటన్నింటినీ రద్దు చేశారు. దీంతో వేతనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గరుగుబిల్లి : మండలంలో ఉపాధి వేతనదారులు అసౌకర్యాల నడుమ అవస్థలుపడి పనులు చేస్తున్నారు. మండలంలోని 10750 జాబ్‌ కార్డులు ఉన్నాయి. జాబ్‌కార్డు ఉన్న ప్రతి వేతనదారులు ప్రతిరోజు పనిలో పాల్గొంటున్నారు. అయితే వేసవి తాపం తాటతీస్తున్న తరుణంలో తీవ్ర అవస్థలుపడుతున్నారు. మార్చి నెల నుంచి తీవ్రమైన ఎండలు మండుతున్నాయి. అయినా ఎక్కడా టెంట్లు గానీ, తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించిన దాఖలాల్లేవు. వీరఘట్టం : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా చేపడుతున్న పని ప్రదేశాల్లో నీడ కరువైంది. పని జరుగుతున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన టెంట్లు, మంచినీటి సౌకర్యం లేక ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో ఉన్న చెట్ల నీడను ఆశ్రయించి అలసట పొందుతున్నారు. గత పది రోజుల నుంచి ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి సుమారు 4362 మంది వేతన దారులు పనిలో పాల్గొంటున్నట్లు ఉపాధి హామీ చట్టం అధికారులు గణాంకాలు చెబుతున్నారు.సకాలంలో అందక అప్పులువేసవిలో వ్యవసాయ, ఇతర పనులు ఉండడం లేదు. దీంతో గత్యంతరం లేక ఉపాధి పనులకు వెళ్తున్నాం. సకాలంలో వేతనాలు మంజూరు చేయడం లేదు. మండుటెండలో చేస్తున్న పనులకు తగిన ప్రతిఫలం అందడం లేదు. అప్పులు చేసి కుటుంబాలను పోషించు కుంటున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు, వేసవి అలవెన్స్‌ మంజూరు చేయాలి.ఎం.పండయ్య కురుపాం గ్రామం.పని ప్రాంతాల్లో తాగునీరివ్వాలిగతంలో పనిచేస్తున్న ప్రదేశాల్లో మంచినీరు ఏర్పాటు చేసేందుకు గ్రూప్‌లో ఒక్కరిని మంచినీళ్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవర్నీ ఏర్పాటు చేయకపోవడంతో పని జరిగే ప్రదేశం ఊరికి దూరంగా ఉండడం. తాగేందుకు నీరు లేక అవస్థలు తప్పడం లేదు.కేతిరెడ్డి గౌరినాయుడు, వేతన దారుడు , నాగూరు గ్రామం,గరుగుబిల్లి మండలం.ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదు…ప్రతి పంచాయతీకి 4 లేక 5 టెంట్లు ఇచ్చార. తాగునీటి సదుపాయం కూడా కల్పించాం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వీటికి నిధులు మంజూరు చేయకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నాం. కొన్ని గ్రామాల వేతనదారులు ఎవరి నీరు వారే తెచ్చుకుంటున్నారు. ఎం.గౌరీనాధ్‌,ఎపిఒ, గరుగుబిల్లి.పని ప్రదేశాల్లో మజ్జిగ, టెంట్లు ఏర్పాటు చేయాలి వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వేతనదారులకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కావునా ప్రభుత్వం పని ప్రదేశంలో టెంట్లు ఏర్పాటు చేసి మజ్జిగను అందజేసి ప్రాథమిక మెడికల్‌ కిట్లను ఏర్పాటు చేసినట్లయితే వడదెబ్బకు గురవ్వకుండా సురక్షితంగా ఉంటాం.జి. సంతోషినిఉపాధి హామీ మేట్‌ కురుపాం.

➡️